• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రహణం మొర్రి అంటే ఏంటి? గ్రహణాలకూ, చిన్నారుల పెదవి చీలిపోవడానికి సంబంధం ఉందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గ్రహణమొర్రి

తిరుపతి జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్వంలో నడిచే బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (BIIRD) ఆసుపత్రిలో సెప్టెంబరు 13 నుంచి గ్రహణం మొర్రి ఆపరేషన్లు (CleftLip and Cleft Palate surgery) ఉచితంగా చేస్తున్నారు.

బెంగ‌ళూరుకు చెందిన వైద్యులు డాక్ట‌ర్ కృష్ణ‌మూర్తి, బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్లాస్టిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఝాన్సీ నేతృత్వంలో తొలిరోజు ఐదుగురికి విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స‌లు నిర్వ‌హించారు.

మూడు నెల‌లు దాటిన చిన్నారి నుంచీ ఏ వయసు వారికైనా ఇక్కడ గ్ర‌హ‌ణ‌ం మొర్రి ఆపరేషన్లు చేస్తారు.

శస్త్రచికిత్స కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉచితంగా ఆపరేషన్ చేయడంతోపాటూ, ర‌వాణా చార్జీలు కూడా అందిస్తున్నారు.

గ్ర‌హ‌ణ‌ం మొర్రి బాధితుల‌కు కొన్ని జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల ఇత‌ర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో, శ‌స్త్రచికిత్స‌ల స‌మ‌యంలో చేసే పరీక్షల్లో ఏవైనా గుండెకు సంబంధించిన వ్యాధులు బయటపడితే, వాటికి కూడా ఉచితంగా చికిత్స‌ చేస్తున్నారు.

గ్రహణమొర్రి

గ్రహణం మొర్రి అంటే ఏంటి?

పై పెదవిలో చీలికను గ్రహణం మొర్రి లేదా దొర్రి పెదవి లేదా చీలిక పెదవి అంటారు. ఇది తల్లి గర్భంలోనే ఏర్పడుతుందని, బిడ్డకు పుట్టుకతోనే ఇది వస్తుందని బర్డ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డప్ప రెడ్డి బీబీసీతో చెప్పారు.

''జన్యుపరమైన లోపాలు, కణజాలం అభివృద్ధిలో సమస్యల వల్ల శిశువు ఇలాంటి చీలిక పెదవితో జన్మిస్తుంది. దీన్ని క్లెఫ్ట్ లిప్ అంటారు. అంగిలిలో కూడా ఇలాంటి చీలిక ఉంటే దాన్ని క్లెఫ్ట్ పాలెట్ అంటారు. ఈ రెండూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసాధారణ కణజాల వృద్ధి వల్ల వచ్చే జన్యుపరమైన ఇబ్బందులు’’ అని ఆయన చెప్పారు.

గ్రహణం మొర్రి మందులతో నయం కాదని, దీనిని ఆపరేషన్ ద్వారా మాత్రమే సరిచేయగలమని రెడ్డప్ప రెడ్డి అన్నారు.

''గతంలో అసలు దీన్ని పట్టించుకునేవారు కాదు. ఎవరూ ముందుకొచ్చి చెప్పుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరగడంతో గ్రహణం మొర్రి ఆపరేషన్లు చేసుకోవడానికి ముందుకొస్తున్నారు’’అని రెడ్డప్ప చెప్పారు.

గ్రహణమొర్రి

గ్రహణం మొర్రికి, గ్రహణానికి సంబంధం ఉందా?

గ్రహణం మొర్రికి సంబంధించి భారతదేశంలో అవగాహన కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయని బర్డ్ ఆస్పత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఝాన్సీ బీబీసీతో చెప్పారు.

“గ్రహణానికి గ్రహణం మొర్రికి ఎటువంటి సంబంధం లేదు. భారతదేశంలో పుడుతున్న ప్రతి 700 మంది పిల్లల్లో ఒకరు ఈ గ్రహణం మొర్రి సమస్యతో పుడుతున్నారు. జన్యుపరమైన లోపాలతోపాటు తల్లి, తండ్రి, మేనమామల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది” అని డాక్టర్ ఝాన్సీ చెప్పారు.

గ్రహణమొర్రి

ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి?

గ్రహణం మొర్రి శస్త్రచికిత్స ఎంత తొందరగా చేయించుకొంటే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

“గ్రహణం మొర్రి సమస్య ఉన్న పిల్లలు చాలా తక్కువ బరువుతో ఉంటారు. క్లెఫ్ట్ లిప్ ఉన్న పిల్లలు పాలు సరిగా తాగలేరు. క్లెప్ట్ పాలెట్ వున్నవారు ఆహారం తీసుకున్నప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. దానివల్ల ఇయర్, లంగ్ ఇన్ఫెక్షన్స్ తరుచుగా వస్తుంటాయి. వారు మాట్లడడానికి ఇబ్బంది పడుతుంటారు” అని డాక్టర్ ఝాన్సీ చెప్పారు.

పిల్లలు పెరిగేకొద్దీ, వారు మిగతావారితో కలిసి తిరగలేకపోతారని, వారిలో ఆత్మన్యూనతా భావం ఉంటుందని రెడ్డప్ప రెడ్డి చెప్పారు.

''దీనివల్ల డిప్రెషన్‌కు గురైన పిల్లలు అందరితో కలిసి ఆడుకోకపోవడం, స్కూలుకు వెళ్లాలంటే ఇబ్బంది పడడం లాంటి సమస్యలు వస్తాయి. ఇవన్నీ లేకుండా ఉండడానికి వారికి చిన్న వయసులోనే ఈ ఆపరేషన్ చేయించడం మంచిది. చిన్నగా ఉంటే ఆపరేషన్ చేసినప్పుడు చిన్న గీతలా కనిపించీ, కనిపించకుండా ఉంటుంది. ఆ చీలిక పెద్దదిగా ఉంటే, ఒక్కోసారి మొదటి ఆపరేషన్‌కే పూర్తిగా కాకపోవచ్చు. కానీ, రెండోసారి చేస్తే అసలు చేసినట్టు కూడా తెలీదు. అలా చేయగలిగే టెక్నిక్స్ పెరిగాయి. చాలా మందిలో ఈ ఆపరేషన్ జరిగినట్లు కూడా గుర్తించలేరు’’అని డాక్టర్ రెడ్డప్ప రెడ్డి చెప్పారు.

“చీలిక కేవలం పెదవి వరకే ఉందా.. లేక డెంటల్ లైన్ కిందికి వెళ్లిందా? పళ్లు వచ్చేటప్పుడు వారికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? అనేదాన్ని బట్టి ఒక్కోసారి 4, 5 విజిట్స్ వరకు కూడా రావాల్సి ఉంటుంది. కొంతమందిని 15ఏళ్లపాటు కూడా మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆపరేషన్ ఒక్కసారిగా అయిపోయేది కాదు. తరచూ వైద్యులను కలవాల్సి ఉంటుంది” అని డాక్టర్ రెడ్డప్పరెడ్డి చెప్పారు.

ఒకసారి గ్రహణం మొర్రి ఆపరేషన్‌ చేస్తే ఒక్కసారిగా మొత్తం మారిపోదు. దాని తర్వాత స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరఫీ, అలాగే దంతాలు వచ్చేటప్పుడు వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? లాంటివి సరిచూసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గ్రహణమొర్రి

గుండె జబ్బులకు సంబంధం ఉందా?

గ్రహణం మొర్రి ఉన్న పిల్లలకు గుండెకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పిల్లలకు పక్కనే ఉన్న పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు కూడా చేస్తున్నారు.

“గ్రహణం మొర్రి ఉన్న పిల్లల్లో అసలు ఇలాంటి సమస్యలు ఉంటాయని తల్లిదండ్రులకు తెలీదు. ఇక్కడికి వచ్చినప్పుడు టెస్టుల్లో అవి బయటపడతాయి. అవి ఉన్నవారికి కూడా టీటీడీ నుంచి సహాయం అందుతుంది. బర్డ్ ఆస్పత్రికి వచ్చే రోగులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు” అని డాక్టర్ రెడ్డప్పరెడ్డి చెప్పారు.

గుండెకు సంబంధించి ఏవైనా పెద్ద పెద్ద ఇబ్బందులు, గుండెలో రంధ్రాలు లాంటివి ఉంటే వారికి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు.

“క్లెఫ్ట్ లిప్, క్లెప్ట్ పాలెట్ సమస్య వల్ల పిల్లలకి పుట్టుకతో గుండె సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. క్లెఫ్ట్ లిప్, క్లెప్ట్ పాలేట్ ఉన్న దాదాపు 30 శాతం మంది పిల్లల్లో ఈ సమస్యలు ఉంటాయి. దీంతో ఈసీజీ, ఎకోకార్డియోగ్రాఫ్, క్లినికల్ అసెస్మెంట్ అన్నీ చేస్తాం. ఏదైనా అసాధారణంగా ఉంటే, అంటే.. శ్వాసకోశ వ్యాధులు, నాలుక వెనక పడడం లేదా మింగడానికి కష్టంగా ఉండడం, పాలు తాగేటపుడు, ఆహారం తినేటపుడు గుటక వేయడానికి ఇబ్బందిగా ఉంటే, అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది” అని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు.

గ్రహణమొర్రి

ఎంత ఖర్చవుతుంది?

సాధారణంగా ఏదైనా ప్రైవేటు ఆస్పత్రిలో గ్రహణం మొర్రి ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్ష నుంచి లక్షన్నర వరకూ ఖర్చు అవుతుందని, ఆ ఆపరేషన్ మళ్లీ మళ్లీ చేయించుకోవాల్సి వస్తే ఇంకా చాలా ఖర్చవుతుందని రెడ్డప్ప రెడ్డి చెప్పారు.

ఆపరేషన్ ఉచితంగా చేయడంతోపాటూ వారి రాకపోకలకు అయ్యే చార్జీలు, ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఆహారం, వసతి అందిస్తున్నారు.

ఆపరేషన్ చేయించుకునేవారు చిన్న పిల్లలు అయితే, వారిలో పోషకాహార లోపం ఉంటే ఆపరేషన్ ముందు, ఆ తర్వాత వారికి పోషకాహారం అందిస్తారు.

ఆపరేషన్లు చేయించుకున్న తర్వాత, అవసరమైనంత కాలం వారికి ఉచితంగానే సప్లిమెంటేషన్ సరఫరా చేస్తామని డాక్టర్ రెడ్డప్పరెడ్డితెలిపారు.

బర్డ్ ఆస్పత్రి ప్రధాన ఉద్దేశం అంగవైకల్యాన్ని నిర్మూలించడమని, గ్రహణం మొర్రి కూడా ఒక విధమైన అంగవైకల్యమేనని ఆయన చెప్పారు.

“ఇక్కడ ఎవరైనా ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఏవీ అవసరం లేదు. పేద, ధనిక, ప్రాంతం, కులం, మతం తేడా లేకుండా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవారైనా ఇక్కడకు వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు”అని డాక్టర్ రెడ్డప్పరెడ్డి వివరించారు.

బర్డ్స్

గ్రహణం మొర్రిని ఎలా గుర్తించవచ్చు?

“గర్భంతో ఉన్నప్పుడు యాంటీ నాటల్ స్కాన్ చేసినప్పుడు గ్రహణం మొర్రిని గుర్తించవచ్చు. క్లెఫ్ట్ ప్యాలెట్‌ను మాత్రం గుర్తించలేం. గర్భంలోనే దీన్ని నయం చేయడం సాధ్యం కాదు కాబట్టి, బేబీ పుట్టిన మూడు నెలల తర్వాత ఆపరేషన్ ద్వారానే దీన్ని సరిచేయాల్సి ఉంటుంది”అని ఝాన్సీ తెలిపారు.

“క్లెప్ట్ ప్యాలెట్ అయితే తొమ్మిది నెలల తర్వాత చేస్తాం. కొందరికి క్లెఫ్ట్ లిప్ మాత్రమే ఉంటుంది. కొందరికి రెండూ ఉంటాయి. వారి దంతాలు కూడా సరిగా ఏర్పడవు. పళ్ల మధ్యలో తేడాలుంటాయి, త్వరగా వస్తే, అలాంటి తేడాలు లేకుండా పూర్తిగా సాధారణంగా చేయగలం” అని ఝాన్సీ చెప్పారు.

డాక్టర్ రాచపల్లి రెడ్డప్ప రెడ్డి

గ్రహణం మొర్రి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఇది రాకుండా అరికట్టడం అనేది చాలా తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. గర్భం దాల్చినప్పుడే మంచి పోషకాహారం, సానుకూల ఆలోచనలు, ఒత్తిడికి లోనుకాకుండా ఉండడం, వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు కొంత తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు.

అలా కాకుండా తల్లి గర్భంతో ఉన్నప్పుడు కొన్ని రకాల మాత్రలు వేసుకోవడం వల్ల, కొన్ని రకాల డ్రగ్స్ ఉపయోగించడం, తల్లికి వైరల్ ఇన్స్పెక్షన్లు వచ్చినపుడు బిడ్డకు గ్రహణం మొర్రి వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని, ఇలాంటివేమీ లేకుండా కూడా రావచ్చని డాక్టర్ ఝాన్సీ వివరించారు.

డాక్టర్ ఝాన్సీ

“ఇది రాకుండా ఉండాలంటే ప్రివెంటబుల్, నాన్ ప్రివెంటబుల్ అని రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. అంటే మనం స్వయంగా కొన్ని నివారించవచ్చు. ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం, డ్రగ్స్ తీసుకోకుండా ఉండడం, పొగతాగకుండా ఉండడం, సమతుల పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడికి లోనవ్వకుండా ఉండడం లాంటివి. ఇవన్నీ మనం చేయవచ్చు. కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే దాన్ని మనం మార్చలేము. అదే నాన్ ప్రివెంటబుల్”అని ఆమె చెప్పారు.

“జెనెటిక్, నాన్-జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. నాన్-జెనెటిక్ ఫ్యాక్టర్స్ విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అంటే తల్లులు పొగ తాగకపోయినా, తండ్రులు పొగ తాగుతూ ఉండచ్చు. అది ఇన్‌డైరెక్ట్ స్మోకింగ్ అవుతుంది. ప్రెగ్నెన్సీకి ముందు తల్లికి డయాబెటిస్ ఉండడం, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండడటం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఇది రావొచ్చు. దీనివల్ల బిడ్డకు గుండె సమస్యలు, గ్రహణం మొర్రి రావచ్చు. పోలిక్ యాసిడ్ తగినంత తీసుకుంటే ఇవి రాకుండా నివారించే అవకాశం ఉంటుంది” అని డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి వివరించారు.

ఒకే చోట అన్ని సేవలు

ఈ ఆస్పత్రిలో స్పీచ్ థెరపిస్ట్, ఆర్తోడంటిస్ట్, పీడియాట్రిషియన్, న్యూట్రిషనిస్ట్ అందరి సమన్వయంతో ఈ ఆపరేషన్లు జరుగుతాయి. అన్ని సేవలూ ఒకే చోట ఉంటాయి కాబట్టి దీనిని ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంగా భావిస్తున్నారు.

బర్డ్ ఆస్పత్రి నిర్వహిస్తున్న ఉచిత గ్రహణం మొర్రి ఆపరేషన్లు చేయించుకోడానికి దూర ప్రాంతాల వారు కూడా వస్తున్నారు.

ఆర్థిక స్తోమత లేకపోవడంతో బర్డ్ ఆస్పత్రికి వచ్చామని, ఇక్కడ స్పందన బాగుందని తమ బిడ్డకు గ్రహణమొర్రి ఆపరేషన్ చేయించుకోడానికి చిత్తూరు జిల్లా కలియంబాకం నుంచి వచ్చిన ఒక కుటుంబం చెప్పింది.

“ఒకసారి చూపిద్దామని ఇక్కడికి వచ్చాం. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఆపరేషన్ చేస్తామని అడ్మిట్ చేసుకున్నారు. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మంచి ఆహారం పెడుతున్నారు. స్టాఫ్ రెస్పాన్స్ కూడా బాగుంది. బాబు పుట్టిన వెంటనే చాలా చోట్ల తిరిగాం. చెన్నైలో మొదటి ఆపరేషన్ జరిగింది. తర్వాత మళ్లీ చేయాలి అన్నారు. మాకు మళ్లీ అక్కడకు వెళ్లి చూపించుకునే స్తోమత లేదు. దేవుడి దయవల్ల ఇక్కడే ఆపరేషన్ బాగా జరిగింది. ముందు పై పెదవికి చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాలెట్ చేశారు. ఇప్పుడు బాగుంది” అని బాబు తల్లి కర్పగం చెప్పారు.

ఎలా నమోదు చేసుకోవాలి?

గ్ర‌హ‌ణ‌ం మొర్రి ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునేవారు సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 7337318107 నంబ‌రుకు ఫోన్ చేసి ముంద‌స్తుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is Grahanam Morri? Is there a connection between eclipses and cleft lip in children?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X