'రెజిమ్' ఛేంజ్ ద్వారా పరిస్థితులు ఏమాత్రం మారవు: బలహీనపడతాం: తేల్చి చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా దసరా పండుగ నాడు నిర్వహించే సాంప్రదాయక ఆయుధపూజ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో సంఘ్ వందేళ్ల సుదీర్ఘ ప్రయాణం, భారతీయ సంస్కృతి రక్షణ, స్వదేశీ భావజాలం, ఐక్యత ప్రాముఖ్యతపై ఆయన ప్రసంగించారు.
దేశ సాంస్కృతిక పునాదులను బలోపేతం చేసిన ప్రముఖుల సేవలను గుర్తు చేసుకున్నారు. స్వదేశీ మేళాల ద్వారా ప్రజలలో జాతీయ చైతన్యాన్ని, స్వదేశీ భావనను రగిలించిన బెంగాల్‌కు చెందిన రాజ్ నారాయణ్ బసు 200వ జయంతిని ఆయన ప్రస్తావించారు. విదేశీ దండయాత్రల సమయంలో దేశ ప్రజలలో భయాన్ని తొలగించి, సామాజిక సామరస్యత, ఆధ్యాత్మిక నిష్ఠ, భక్తి మార్గాన్ని ప్రబోధించిన సంత్ రవిదాస్ జీవితం నేటి సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

వందేళ్లుగా భారతీయత, మూల సంస్కృతి, సాంప్రదాయాల ఆధారంగా సమాజాన్ని ఏకం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం కృషి చేస్తూనే వస్తోందని భగవత్ తెలిపారు. పంచ్ పరివర్తన్ పేరుతో రాబోయే కాలంలో అయిదు ముఖ్యమైన మార్పులను ఆయన ప్రతిపాదించారు. స్వదేశీ ఉత్పత్తులను ఆదరించడం, స్వీయ గుర్తింపును చాటుకోవడం ఇందులో ప్రధానమైనవని వివరించారు. విదేశీ వస్తువులపై ఆధారపడటం తగ్గించి, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన పిలుపునిచ్చారు.
భారత్.. విభిన్న ప్రాంతాలు, సంస్కృతులు, కులాలు, భాషలు, ఆహారపు అలవాట్లతో కూడిన వైవిధ్యభరిత దేశమని భగవత్ పేర్కొన్నారు. ఈ వైవిధ్యం.. యావత్ సృష్టిలోనే అత్యంత సహజమైనదని, వాటన్నింటినీ ఒకటిగా అనుసంధానించే అంతర్గత ఏకత్వమే సనాతన సత్యమని వ్యాఖ్యానించారు. యుగయుగాలుగా వస్తున్న ఈ ఐక్యతా సూత్రమే దేశాన్ని ఏకం చేసిందని, భవిష్యత్తులో కూడా ఇదే ప్రాతిపదికన భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
స్వధర్మ పరిరక్షణ గురించి మోహన్ భగవత్ ప్రస్తావించారు. 'స్వ' అంటే స్వీయ అస్తిత్వ భావనను జాగృతం చేయడమేనని, ఇది అత్యంత అవసరమని పేర్కొన్నారు. మన రాజ్యాంగ పీఠిక లోని వాక్యాలు దేశ పౌరులందరినీ ఒక్కటి చేసే భావోద్వేగ బంధానికి ప్రతీకగా అభివర్ణించారు. భిన్నత్వంతో కూడిన ఈ విశాల దేశం ప్రాచీన కాలం నుంచీ ఒకే సమాజంగా, ఒకే దేశంగా వర్ధిల్లడానికి ఈ 'స్వబోధ' కారణమని పేర్కొన్నారు.
ఈ అంతర్గత ఐక్యతా స్ఫూర్తిని వీడినప్పుడే మన దేశంలో విచ్ఛిన్నకర ధోరణులు పెరిగి, శతాబ్దాల తరబడి పరాయి పాలనను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని, విభజన రాజకీయాలకు దూరంగా ఉండాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. విడిపోయిన ప్రతీసారీ దేశం బలహీనపడిందని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జాతీయ ఐక్యత, సామాజిక సామరస్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.
సమైక్యతా భావన ఆధారంగానే భారతదేశం ప్రపంచ వేదికపై మరింత శక్తివంతంగా నిలబడగలదని అన్నారు. దేవాలయాలు, మఠాలు, గురుద్వారాలు.. ఇలా ఏ ప్రార్థనా ప్రదేశాన్ని సందర్శించినా, ఒకేరకమైన జ్ఞానం, ఆధ్యాత్మిక భావన లభిస్తుందని, దేశ భావజాలంలో ఇది ఇమిడిపోయిందని భగవత్ అన్నారు. ఇటువంటి వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇది మార్పులకు లోబడి ఉంటుందని గుర్తు చేశారు.
ప్రపంచ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలను కూడా భగవత్ గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాల నుంచి వస్తోన్న కొన్ని ప్రతికూల ధోరణులు.. దేశ సంప్రదాయాలు, క్రమశిక్షణ, సామాజిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్, ఆల్బేనియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇటీవల జరుగుతున్న నిరసనలు ఉదహరించారు. ప్రభుత్వ మార్పు ద్వారా పరిస్థితులు మారబోవని స్పష్టం చేశారు. అటువంటి విదేశీ విద్రోహ భావజాలాల పట్ల భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, దేశ అంతర్గత భద్రత, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
