'పింక్ సిటీ' అందాలు చూసొద్దామా..? ఎలా వెళ్లాలి..?
రాజస్థాన్ లోని జైపూర్ నగరం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నగరాన్ని పింక్ సిటీ అని పిలుస్తారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి రాజులకాలం నాటి చారిత్రక కట్టడాలు, కోటలు, ప్యాలెస్ లు, మహాల్ లు అత్యద్భుతంగా ఉంటాయి. ఈ భవనాలు అన్నీ పింక్ కలర్ తో ఉంటాయి. అందువల్లనే జైపూర్ నగరానికి పింక్ సిటీ అని పేరు వచ్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పర్యటకులు అధిక సంఖ్యలో ఈ చారిత్రక నగరాన్ని సందర్శిస్తుంటారు.
ఇక పింక్ సిటీ జైపూర్ లో చూడదగిన ప్రదేశాలుగా.. అంబర్ కోట, హవా మహల్, సిటీ ప్యాలెస్, నహర్ గఢ్ కోట, జంతర్ మంతర్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జైగర్ కోట, బిర్లా టెంపుల్, జల్ మహల్ ఉన్నాయి. అంబర్ కోట.. జైపూర్ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది జైపూర్ లోని అత్యంత చారిత్రకమైన కోటల్లో ఒకటి. ఈ కోటను నుంచే రాజస్థాన్ ను మహారాజా సావాయ్ జై సిగా పరిపాలించారు. ఈ కోట భారీ కొండపై నిర్మించారు. శత్రు దేశాల నుంచి రాజ్య ప్రజల రక్షణ కోసం ఇలా కొండపై కోటను నిర్మించారు. కోట వాస్తుకళ ఉట్టిపడుతుంది. నిర్మాణశైలి అద్భుతంగా ఉంటుంది.
జైపూర్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హవా మహల్. ఇదో ఐకానిక్ కట్టడం. దీనికి ప్యాలెస్ ఆఫ్ విండ్స్ అని పిలుస్తుంటారు. ఇది ఐదు అంతస్తుల భవనం. ఈ కట్టడాన్ని సావాయ్ ప్రతాప్ సింగ్ 18 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ భవనానికి దాదాపు 1000 కిటికీలు ఉండటం విశేషం. హవా మహల్ నుంచి జైపూర్ నగర అందాలను చూసేందుకు ఈ మహల్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. అలగే సిటీ ప్యాలెస్ కట్టడంలో అనేక మ్యూజియంలు కనిపిస్తాయి. ఈ కోటను రాజస్థానీ- మొఘల్స్ శైలిలో నిర్మించారు. ఈ ప్యాలెస్ జైపూర్ లోనే ఉంటుంది.

అలాగే జైపూర్ లో నహర్ గఢ్ కోట, జంతర్ మంతర్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జైగర్ కోట, బిర్లా టెంపుల్, జల్ మహల్ కూడా ఉన్నాయి. నహర్ గఢ్ కోట నుంచి జైపూర్ సిటీ అందాలను వీక్షించవచ్చు. ఈ కోట ఆరావళి పర్వతాల్లో ఉంటుంది. అలాగే రాజస్థాన్ లోని పురాతనమైన మ్యూజియంగా ఆల్బర్ట్ మ్యూజియంకు పేరుంది. ఇక్కడ అనేక కళాఖండాలను ప్రదర్శిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి విమానం, రైలు, బస్సుల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఈ నగరం దాదాపు 1100 కిలోమీటర్లు ఉంటుంది. జైపూర్ కు కాచిగూడ నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జైపూర్ కు విమానాలు అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications