షాకింగ్: జీన్స్ వేసుకోవద్దన్నందుకు భర్తను విచక్షణారహితంగా పొడిచి చంపిన భార్య
రాంచీ: నూరేళ్లపాటు అన్యోన్యంగా సాగాల్సిన కాపురాలు చిన్న చిన్న విషయాలకే కూలుతున్నాయి. అనవసరమైన క్షణికావేశాలు చివరకు ప్రాణాలు కూడా తీస్తున్నాయి. తాజాగా, తనను జీన్ ప్యాంట్ వేసుకోవద్దని చెప్పిన భర్తతో తీవ్ర వాగ్వాదానికి దిగిన భార్య.. చివరకు అతడిపై కత్తితో దాడి చేసి ప్రాణాలు తీసింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
జంతారా జిల్లాలోని జోర్బిత గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించిన వివరాల్లోకి వెళితే.. నిందితురాలు పుష్ప హోంబ్రోమ్ అనే వివాహిత జులై 16న గోపాల్‌పూర్ గ్రామంలో జరుగుతున్న జాతరకు జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత ఆమె భర్త.. ఆమెను జీన్స్ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావని అడిగాడు.

పెళ్లైన తర్వాత కూడా జీన్స్ ప్యాంట్ వేసుకుని ఎందుకు తిరుగుతున్నావ్? అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో పుష్ప, ఆమె భర్త మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన పుష్ప.. తన భర్తపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన ఇతర కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు బాధితుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications