Covaxin: భారత్ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్‌న్యూస్
వాషింగ్టన్: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు ఇంకా అనేక దేశాల్లో కనిపిస్తూనే ఉంది. ఈ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలి వెళ్లబోదనేది స్పష్టమైంది. భారత్ సహా పలు దేశాలు కరోనా వైరస్ ప్రభావానికి లోనవుతూనే ఉన్నాయి. థర్డ్‌వేవ్ ముప్పు సైతం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. దీనికి సంబంధించిన హెచ్చరికలను నిపుణులు ఎప్పటికప్పుడు జారీ చేస్తోన్నారు. అటు కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కూడా అనేక దేశాల్లో విస్తరించింది. చాప కింద నీరులా పాకేసింది.
అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ డెల్టా వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదవుతోన్నాయి. మరోవంక- దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. భారత్‌లో 70 కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇందులో తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యే అధికం. రెండో డోసు కోసం సుమారు 80 నుంచి 90 రోజుల పాటు వ్యవధి ఉంటోంది.

తొలి డోసు, రెండో డోసు మధ్య వ్యవధిని పెంచడం వల్ల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో ఉన్నంత కొరత ఇప్పుడు లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను సరఫరా చేస్తోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ విస్తృతంగా వినియోగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులోనూ కోవిషీల్డ్ వాటా అధికంగా ఉంటోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. అది పరిమితమే.
ఎంపిక చేసిన కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, ఇతర వ్యాక్సినేషన్ కేంద్రాల్లో స్పుత్నిక్- వీ వాడకంలో ఉంటోంది. వాటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి జైడస్ క్యాండిలా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా త్వరలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. వాటికి సంబంధించిన దరఖాస్తులు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద పరిశీలనలో ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్తను వినిపించింది. ఈ వారంలోనే కోవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వడానికి డబ్ల్యూహెచ్ఓ అంగీకరించినట్లు వార్తలు వస్తోన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్‌ను గుర్తించితే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగించడానికి అడ్డంకులు ఉండవు.
కోవాగ్జిన్‌ను అధికారికంగా గుర్తించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అడిగిన డాక్యుమెంట్లు, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను అందజేసినట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ పరిశీలించిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటుందని, అది ఇంకో వారంలో వెలువడుతుందని సమాచారం. డెల్టా వేరియంట్ పైనా కోవాగ్జిన్ ప్రభావాన్ని చూపుతుందని, దీని ఎఫీషియన్సీ 65 శాతంగా నమోదైనట్లు భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా చెప్పారు.
డబ్ల్యూహెచ్ఓ గుర్తింపును పొందడం వల్ల ఇక ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి వీలు కలుగుతుందని భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణా ఎల్లా అన్నారు. సొంతంగా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయలేని దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ ఉచితంగా అందజేస్తోన్న వ్యాక్సిన్ల జాబితాలో కూడా కోవాగ్జిన్ చోటు దక్కించుకుంటుందనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
World Health Organisation (WHO) nod for Bharat Biotech's #COVID19 vaccine, Covaxin is expected this week: Sources pic.twitter.com/IYE9qkfHtb
— ANI (@ANI) September 13, 2021












Click it and Unblock the Notifications