Vaccine War : వ్యాక్సిన్ వార్ చిత్రంపై యోగీ ప్రశంసలు-అందరూ చూడాలని పిలుపు..
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన తాజా చిత్రం "ది వ్యాక్సిన్ వార్". సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అందుబాటు ధరలో కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన భారతీయ శాస్త్రవేత్తల కృషిపై రూపొందించారు.
అలాగే అప్పట్లో వ్యాక్సిన్ వార్ ఎలా సాగిందన్న దానిపై పలు అంశాల్ని ఇందులో ప్రస్తావించారు. దీన్ని తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీక్షించారు.
అనంతరం సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రజలంతా 'ది వ్యాక్సిన్ వార్' చిత్రం చూడాలని పిలుపునిచ్చారు. ఇది భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలను బయటపెట్టిందన్నారు. భారతదేశ శాస్త్రీయరంగం విజయాలను అద్భుతంగా చూపించిందని, అలాగే భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిని కూడా ఇది పెంచుతుందని యోగీ తెలిపారు. భారతదేశం, భారతీయ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని యోగీ ప్రస్తావించారు. ప్రతి విద్యార్థి, యువకుడికి ఈ చిత్రాన్ని చూడాలని, భారతదేశం యొక్క శాస్త్రీయ విజయాల గురించి గర్వపడాలని కోరారు.

"ఒక కొత్త చిత్రం వచ్చింది - ది వ్యాక్సిన్ వార్, ఇది ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క అత్యుత్తమ శాస్త్రీయ విజయాలను ప్రస్తావిస్తుంది. భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను బహిర్గతం చేయడానికి, భారతీయ శాస్త్రవేత్తలు చేసిన సంచలనాత్మక పరిశోధనలను హైలైట్ చేయడానికి, ప్రపంచ పటంలో భారతదేశానికి గొప్ప గుర్తింపును పెంపొందించడానికి ఈ చిత్రం అంకితం చేశారని యోగీ తెలిపారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన పోరాటం ఒక వ్యక్తి యొక్క యుద్ధం కాదని, ప్రధానమంత్రి కెప్టెన్‌గా నాయకత్వం వహించడంతో, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం ద్వారా ఈ పోరాటాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నించారన్నారు 'వ్యాక్సిన్ వార్' దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రలను వెలుగులోకి తెస్తుందని, దేశాన్ని అణగదొక్కడానికి జరుగుతున్న ఎడతెగని ప్రయత్నాల వెనుక ముఖాలను బయటపెడుతుందన్నారు.












Click it and Unblock the Notifications