మీరు ముందు పెళ్లి చేసుకోండి సార్.. స్వీట్లు మేమే పంపిస్తాం గానీ
లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. దీపావళి పండుగ సందర్భంగా దేశ రాజధానిలోని ఓ స్వీట్ షాప్‌ను సందర్శించారు. ఓల్డ్ ఢిల్లీ చాందినీ చౌక్‌లోని ఘంటేవాలా స్వీట్ షాప్ ఇది. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. 235 సంవత్సరాల చరిత్ర ఉందీ షాప్ కు. మొఘల్ చక్రవర్తి షా ఆలం-2 కాలంలో ఇది ఏర్పాటైంది. అప్పటి నుంచి ఘంటేవాలా కుటుంబ సభ్యులు దీన్ని నడిపిస్తోన్నారు. తరతరాలుగా ఆ కుటుంబ సభ్యులు దీని నిర్వహణ బాధ్యతలను చూసుకుంటూ వస్తోన్నారు.
ఘంటేవాలా షాప్.. సోహన్ హల్వాకు ప్రసిద్ధి. నెహ్రూ-గాంధీ కుటుంబం ఇప్పటికీ ఈ షాప్ నుంచే స్వీట్లను కొనుగోలు చేస్తుంటుంది. నెహ్రూ- గాంధీ కుటుంబానికి నాలుగు తరాలుగా సేవలను అందిస్తోంది. 2015లో లైసెన్సింగ్ నిబంధనల కారణంగా ఈ షాప్ ను తాత్కాలికంగా మూసివేశారు. గత సంవత్సరం మళ్లీ అదే ప్రారంభమైంది. తన కుటుంబంతో ఉన్న ప్రత్యేక అనుబంధం ఉన్నందున రాహుల్ గాంధీ.. ఈ షాప్ కు వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడే గడిపారు.

నార్త్ లో మంచి డిమాండ్ ఉండే స్వీట్ ఐటమ్ ఇమర్తీతో పాటు జిలేబీ, బేసన్ లడ్డూలు తయారుచేయడానికి ప్రయత్నించారు. ఘంటేవాలా షాప్ యజమాని సుశాంత్ జైన్‌తో మాట్లాడారు. పేస్త్రీలు, ప్యాటీ, బర్గర్స్.. వంటి వెస్ట్రన్ ఫుడ్స్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కూడా సంప్రదాయ స్వీట్లకు డిమాండ్ తగ్గలేదని అన్నారు. పండగ సీజన్ లల్లో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా హల్వా వంటి స్వీట్లకు మంచి ఆదరణ ఉందని చెప్పారు.
రాజీవ్ గాంధీ- సోనియా, ప్రియాంకా గాంధీ- రాబర్ట్ వాద్రా వివాహాలకు తామే స్వీట్లు పంపించినట్లు సుశాంత్ జైన్ చెప్పారు. రాజీవ్ గాంధీ- సోనియా వివాహ ఆహ్వాన పత్రిక కూడా తనకు అందిందని చెప్పారు. ఈ వెడ్డింగ్ కార్డ్ ఫ్రేమ్ కట్టి గోడకు తగిలించినట్లు చెప్పారు. గాంధీ కుటుంబ సభ్యులతో తన పూర్వీకులు దిగిన ఫొటోలను కూడా ఆయన రాహుల్ గాంధీకి చూపించారు.
"మీ పెళ్ళికి కూడా మేమే స్వీట్లు పంపిస్తాం. మీరు త్వరగా పెళ్ళి చేసుకోండి. మీ పెళ్లి ఏర్పాట్లన్నీ మేమే చేస్తాం. వెడ్డింగ్ ఫొటోలు ఇలా గోడకు తగిలించుకుంటాం.." అని సుశాంత్ జైన్ సరదాగా రాహుల్‌తో అన్నారు. దీనికి ఆయన చిరునవ్వు నవ్వారు. రాజీవ్ గాంధీకి ఇమర్తీ, బేసన్ లడ్డూలు అంటే చాలా ఇష్టమని, అందుకే వాటిని స్వయానా తయారు చేయడానికి ప్రయత్నించానని రాహుల్ చెప్పారు.












Click it and Unblock the Notifications