పంచ గ్రహకూటమి- సూర్యోదయానికి ముందే: ఏం జరగబోతోంది?
వాషింగ్టన్: అంతరిక్షంలో మరో అద్భుతం సంభవించింది. పంచ గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేశాయి. సూర్యోదయానికి ఒక గంట ముందు ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. బుధుడు, యురేనస్, గురుడు, నెప్ట్యూన్, శని గ్రహాలు.. ఒకే వరుసలో కనిపించాయి. ఈ తెల్లవారు జామున ఆకాశంలో పరేడ్ చేశాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండానే నేరుగా వీక్షించగలిగారు.
సరిగ్గా ఈ తెల్లవారు జామున 5 గంటలకు బుధుడు, యురేనస్, గురుడు, నెప్ట్యూన్, శని గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, స్టార్ వాక్ డాట్ స్పేస్ వెబ్‌సైట్ తెలిపాయి. గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్న వేర్వేరు రాశుల్లోకి ప్రవేశించినప్పుడు ఒకే వరసలోకి వస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇదివరకు చంద్రుడు, గురుడు, శని గ్రహాలు ఒకే వరుసలో కనిపించాయి.

ఇప్పుడు మళ్లీ అలాంటి అద్భుతమే ఆకాశంలో కనిపించింది. నెప్ట్యూన్, యురేనస్.. సాధారణ కంటికి కనిపించలేదు. వాటిని చూడటానికి స్పేస్ టెలిస్కోప్ వినియోగించారు. భూమికి సుదూరంగా, పాలపుంతకు చివరివైపున ఉండటమే దీనికి కారణం. దీనితో పాటు గురు గ్రహానికి ఏడు డిగ్రీల కింద యురేనస్ ఉండటం వల్ల అది నేరుగా కంటికి కనిపించలేదు.
తొలుత శని గ్రహం రాకతో ఈ పరేడ్ ఆరంభమైంది. శని గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించింది. ఆ తరువాత వరుసగా నెప్ట్యూన్- మీనం, జుపిటర్, యురేనస్ గ్రహాలు మేషరాశిలో, బుధగ్రహం వృషభరాశిలో ప్రవేశించాయి. శనిగ్రహం-0.9, నెప్ట్యూన్- 7.9, గురుగ్రహం- మైనస్ 2.2, యురేనస్- 5.8, బుధుడు- మైనస్ 0.9 కక్ష్యలో కనిపించాయి. బుధగ్రహం రాకతో ఈ లైనప్ పరిపూర్ణమైంది. కొన్ని నిమిషాల పాటు కనువిందు చేసింది.
వీటిల్లో బుధ, గురు, శని గ్రహాలను సాధారణ కంటితో చూడగలిగారు. మిగిలిన రెండింటినీ వీక్షించడానికి స్పేస్ టెలిస్కోప్, బైనాక్యులర్లు అవసరం అయ్యాయి. కాగా వీటిని వీక్షించడానికి నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాటిని తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ టెలికాస్ట్ చేసింది. ఇలా గ్రహాలు ఒకే వరసలోకి రావడం వల్ల వాటి ప్రత్యేక స్థితిగతులను అధ్యయనం చేయడానికి వీలవుతుందని తెలిపింది.
ఈ ఏడాది జులై 22వ తేదీన కూడా ఆలాంటి ఖగోళ అద్భుతం సంభవించనుంది. ఈ ఏడాదికి అదే చివరిది అవుతుంది. కుజగ్రహం (Mars), శుక్ర గ్రహం (Venus), బుధగ్రహం (మెర్క్యురి) ఒకే వరసలోకి రానున్నాయి. 2024, 2025లో మూడుసార్లు చొప్పున మళ్లీ ఆయా గ్రహాలన్నీ ఒకే వరసలోకి వస్తాయి. సరళరేఖలా కనిపిస్తాయి.












Click it and Unblock the Notifications