బాలికలకు విద్యకు పూర్తిగా దూరం చేసిన ఏకైక దేశం

ఆ కళ్లలో ఒకప్పుడు డాక్టర్ అవ్వాలనే కలలు ఉండేవి.. ఆ చేతులు పెన్ను పట్టి ప్రపంచాన్ని మార్చేస్తాయన్న నమ్మకం ఉండేది. కానీ నేడు.. అదే కళ్లలో నీడలు ముసిరాయి, ఆ చేతులు వంటింటి పనికి, అణిచివేతకు అలవాటు పడిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రాకతో ఆగిపోయిన కాలం, లక్షలాది మంది బాలికల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. తాజాగా యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక.. అక్కడి కఠిన వాస్తవాలకు అద్దం పడుతోంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు 22 లక్షల మంది కౌమార బాలికలు నేడు బడి గడప తొక్కలేకపోతున్నారు. సెకండరీ విద్యపై తాలిబన్లు విధించిన నిషేధం వల్ల.. ఆరో తరగతి పూర్తి కాగానే బాలికల పుస్తకాలు మూతపడుతున్నాయి. "స్కూల్ తెరుస్తారని ఎదురుచూసి ఎదురుచూసి అలసిపోయాం.. మా కలలు ఎండమావిలా మారిపోయాయి" అని ఓ 16 ఏళ్ల బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారిలో కూడా 93% మంది కనీసం చదవడం, రాయడం కూడా రాని దుస్థితి నెలకొంది.

Afghanistan Bans Girls Education Beyond Grade 6 Leaving Millions of Young Dreams Shattered

2021 ఆగస్టులో టాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. మొదట "తాత్కాలిక నిర్ణయం"గా ప్రకటించిన నిషేధం, క్రమంగా శాశ్వత శిక్షగా మారింది. ఆరు తరగతి దాటిన బాలికలకు పాఠశాలల తలుపులు మూసివేశారు. యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు.

బాల్య వివాహాల ఉచ్చు.. మౌనమే సమాధానమా?

విద్యకు దూరం కావడంతో ఆ బాలికలకు మరో భయంకరమైన ముప్పు పొంచి ఉంది. చదువు లేదు కాబట్టి, భారమనుకున్న తల్లిదండ్రులు వారిని చిన్న వయసులోనే పెళ్లిళ్ల వైపు నెడుతున్నారు. మరికొందరు అడవిలో మగ్గుతూ, ఇంటి గడప దాటడానికి భయపడుతున్నారు. తాలిబన్ల కొత్త చట్టాల ప్రకారం.. మహిళల గొంతు బయట వినిపించడం కూడా నేరమే! మాట్లాడితే నేరం, చదివితే పాపం అన్నట్లుగా వారి జీవితం గృహ నిర్బంధమైపోయింది.

భవిష్యత్తులో వైద్యులే ఉండరా?

మహిళలకు కేవలం మహిళా వైద్యులే చికిత్స చేయాలన్న నిబంధన ఉన్న దేశంలో.. అసలు బాలికలే చదువుకోకపోతే రేపటి తరం వైద్యులు, నర్సులు ఎక్కడి నుండి వస్తారు? "బాలికలకు విద్యను దూరం చేయడం అంటే ఆ దేశ భవిష్యత్తును చంపేయడమే" అని ఐరాస హెచ్చరిస్తోంది.

ప్రాణం ఉన్న శవాల్లా..

అంతర్జాతీయ సమాజం ఎంత మొరపెట్టుకున్నా తాలిబన్ల మనసు కరగడం లేదు. ఇది తమ 'అంతర్గత వ్యవహారం' అని వారు కొట్టిపారేస్తున్నారు. కానీ అక్కడ కోట్లాది మంది బాలికలు ప్రతిరోజూ తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం నిశ్శబ్దంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆఫ్ఘన్ నేలపై నేడు వెలుగు చూడని ఎన్నో గాథలు ఉన్నాయి.. వినేవారు లేని ఎన్నో రోదనలు ఉన్నాయి. ఆ చీకటి గదిలో మగ్గుతున్న ఆ బాలికలకు కావాల్సింది సానుభూతి కాదు.. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే, స్కూలుకు వెళ్లే హక్కు!

"ఆకాశంలో సగం" అని చెప్పుకునే మహిళలకు అక్కడ నిలవడానికి నేల కూడా దొరకడం లేదు. ప్రపంచ దేశాలు స్పందించి, ఆ బాలికల జీవితాల్లో వెలుగు నింపకపోతే.. ఒక తరం మొత్తం అక్షరం ముక్క రాని అంధకారంలో కలిసిపోవడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+