అమెరికాలో ప్రమాదానికి గురైన అమెజాన్ ఎయిర్ కార్గో ఫ్లైట్
అమెరికాలో ఓ కార్గో ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఎయిర్‌కు చెందిన విమానం అది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. సమాచారం అందిన వెంటనే భద్రత సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో పౌర విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఫ్లోరిడా మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కు చెందిన బోయింగ్ 767-300 రకానికి చెందిన విమానం ప్యూర్టోరికోలోని సాన్ జువాన్ సిటీ నుండి మయామికి బయలుదేరింది. అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో మయామి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. రన్‌వేపై నుంచి పక్కకు దూసుకెళ్లింది. అక్కడ పార్క్ చేసి ఉన్న అనేక ఇతర వాహనాలను ఢీకొట్టింది.

ఈ తాకిడితో ఫ్లైట్ ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఉవ్వెత్తున మంటలు ఎగిశాయి. నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. విమానాశ్రయం సమీపంలో ఉన్న ప్రజలు తీవ్ర గందరగోళం, భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదం సంభవించిన నిమిషాల్లోనే దాదాపు 60 రెస్క్యూ యూనిట్లకు చెందిన మయామి డేడ్ ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు.
ఈ అగ్నిప్రమాదం కారణంగా విమానాశ్రయంలోని అన్ని రన్‌వేలలో కూడా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై అమెజాన్ యాజమాన్యం స్పందించింది. అవేదన వ్యక్తంచేసింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి కెల్లీ నాంటెల్ తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలతో సహా అందరికీ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
NEW: An Amazon Prime Air Boeing 767 cargo jet overran the runway at Miami International Airport and caught fire.
— Clash Report (@clashreport) September 6, 2026
Heavy black smoke visible from across the city.
The FAA issued a ground stop. pic.twitter.com/RNL2db0GRI
ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేపట్టింది. నేషనల్ ట్రాన్స్ పోర్ట్ సెక్యూరిటీ బోర్డ్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విమానం బ్లాక్ బాక్స్, ఇతర సమాచారాన్ని సేకరిస్తోన్నారు. ల్యాండింగ్ సమయంలో వాతావరణ ప్రభావం ఉందా లేక సాంకేతిక వైఫల్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తోన్నారు.












Click it and Unblock the Notifications