విమానంలో నగ్నంగా పరుగులు తీసిన ప్రయాణికుడు!
మెల్బోర్న్: ఇటీవల కాలంలో విమానాల్లో కొందరు ప్రయాణికులు తమ ప్రవర్తనతో ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారు. తోటి ప్రయాణికులపై దాడులు చేయడం, అత్యవసర ద్వారాన్ని తెరవడం, ఇంకా అసభ్యకర, అభ్యంతరకర ప్రవర్తలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాకు చెందిన విమానంలో చోటు చేసుకుంది.
ఓ ప్రయాణికుడు నగ్నంగా విమానంలో పరుగెడుతూ గందరగోళానికి దారితీశాడు. వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మెల్బోర్న్‌కు వీఏ696 విమానం సోమవారం రాత్రి బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ ప్రయాణికుడి ప్రవర్తన అంతా షాకయ్యారు.

తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ ఇటూ పరుగులు తీశాడు. అంతేగాక, అడ్డుకున్న విమాన సిబ్బందిని తోసి కిందపడేశాడు. అతడి చర్యతో తోటి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విమాన సిబ్బంది అందించిన సమాచారం మేరకు విమానాశ్రయం చేరుకున్న పోలీసులు.. విమానం ల్యాండైన వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఆ వ్యక్తి ప్రవర్తనపై స్పందించింది ఎయిర్‌లైన్స్ సంస్థ. ఆ వ్యక్తి వల్ల ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది.












Click it and Unblock the Notifications