Canada News: ఇంటెలిజెన్స్ అధికారిపై కెనడా ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు.. ఎట్టకేలకు భారత్ తత్వం బోధపడిందా..?
Justin Trudeau: కెనడా మరియు భారత్ మధ్య సంబంధాలు ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి దిగజారాయి. మన ప్రధాని మోదీపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలే ఇందుకు ప్రముఖ కారణంగా తెలుస్తోంది. నిజ్జర్ హత్యోదంతం దీనికి మూలకారణం. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ చెబుతున్నా, కెనడా మాత్రం ఆరోపణల తీవ్రతను అంతకంతకూ పెంచడంతో పరిస్థితి చేదాటిపోయింది.
తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ దేశ ఇంటెలిజెన్స్ అధికారిపై ఫైర్ అయ్యారు. వారిలో ఒకరిని క్రిమినల్‌గా వర్ణించారు. కెనడాలో జరిగిన హింసాత్మక ఘటనలకు, ఇండియా అగ్ర నాయకత్వానికి మధ్య సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై మీడియాకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా గతేడాది బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య గురించి వారు ప్రశ్నించారు.

'దురదృష్టవశాత్తూ, అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేసే నేరస్థులు ఆ కథనాలను సంబంధించి నిరంతరం తప్పు అప్‌డేట్స్ పొందినట్లు మాకు తెలిసింది. అందుకే విదేశీ జోక్యంపై మేము జాతీయ విచారణ నిర్వహించాము, అటువంటి లీక్‌లు నేరపూరితమైనవి, నమ్మదగినవి కాదు' అని ట్రూడో చెప్పుకొచ్చారు.
కెనడాలో జరిగిన హింసాత్మక కుట్రల గురించి భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు తెలుసని కెనడాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ది గ్లోబ్ అండ్ మెయిల్ గతంలో పేర్కొంది. అయితే ట్రూడో ఇంటెలిజెన్స్ సలహాదారు నథాలీ డ్రౌయిన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ మేరకు కెనడా ప్రభుత్వం పేర్కొనలేదని, తమవద్ద సాక్ష్యాలు లేవని వెల్లడించారు. ఇందుకు విరుద్ధమైన ప్రసారాలు ఏవైనా ఊహాత్మకమైనవేనని ప్రకటించారు.
కెనడా ఆరోపణలపై భారత ప్రభుత్వం కూడా ధీటుగా స్పందించింది. కెనడా ఓటు-బ్యాంక్ రాజకీయాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమంటూ తమపై ట్రూడో ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను న్యూ ఢిల్లీ ఖండించింది. అవన్నీ అసంబద్ధం మరియు విద్వేషాలు ప్రేరేపించేవని బదులిచ్చింది. తన జాతీయ భద్రతకు ముప్పు కలిగించే నేరస్థులు మరియు ఉగ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇస్తోందని భారత్ ఆరోపించింది.












Click it and Unblock the Notifications