మంత్రి విమానానికి ఘోర ప్రమాదం ..నిమిషాల్లో బూడిద
ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోల్వేజీ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో, ఆ దేశానికి చెందిన గనుల శాఖ మంత్రి ప్రయాణిస్తున్న విమానం పూర్తిగా దగ్ధమైంది. అయితే, అదృష్టవశాత్తూ మంత్రి , సిబ్బంది అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడటం సంచలనంగా మారింది.
ఈ ప్రమాదం విమానం ల్యాండవుతున్న సమయంలో సంభవించింది. విమానం రన్‌వేపై దిగే ప్రయత్నంలో ఉండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగి, పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేసమయానికి, విమానం పూర్తిగా కాలి బూడిదైంది.

ప్రమాదం జరిగిన తీరు చూస్తే, విమానంలో ఉన్నవారు బతికే అవకాశం లేదని భావించినా, సాంకేతిక లోపం లేదా ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తత కారణంగా మంత్రి , ఆయన సిబ్బంది చాకచక్యంగా బయటపడగలిగారు.
ఈ ఘటనతో కాంగో ప్రభుత్వం, ముఖ్యంగా ఆ దేశ గనుల శాఖ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. దేశంలోని కీలకమైన మంత్రివర్యులు సురక్షితంగా బయటపడటం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. విమానం పూర్తిగా దగ్ధమైనప్పటికీ, ప్రాణ నష్టం జరగకపోవడం ఒక అద్భుతమని అక్కడి స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications