పాపం అతను భార్యా బాధితుడు- అందుకే బహిష్కరించట్లేదు: జాలి చూపిన ట్రంప్
Donald Trump: అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్రిన్స్ హ్యారీ పట్ల ఆయన జాలి చూపారు. ఇమ్మిగ్రేషన్‌లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ- హ్యారీని దేశం నుంచి బహిష్కరించదలచుకోలేదు. దీనికి కారణం- ఆయన భార్యా బాధితుడు కావడమే.
ప్రిన్స్ హ్యారీ అమెరికా విసా విషయంలో గతంలో వివాదాలు తలెత్తాయి. డ్యూక్ సస్సెక్స్ ఇమ్మిగ్రేషన్‌లో కొన్ని సాంకేతిక లోపాలు ఉండటం వల్ల గతంలో విసా ఇవ్వడానికీ ఆ దేశం నిరాకరించింది. మాదకద్రవ్యాలను వినియోగించిన విషయాన్ని దాచి పెట్టారని, దీన్ని విసా దరఖాస్తులో పొందుపర్చలేదంటూ గతంలో హెరిటేజ్ ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సమస్య తలెత్తింది.

విసా కోసం దరఖాస్తు చేసే సమయంలో డ్రగ్స్ వినియోగం గురించి ఖచ్చితంగా వివరించాల్సి ఉన్నప్పటికీ- ప్రిన్స్ హ్యారీ అలా చేయలేదంటూ హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ నైల్ గార్డెనర్ తెలిపారు. దీనిపై ఇమ్మిగ్రేషన్ అధికారులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. అప్పట్లో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌పై ప్రిన్స్ హ్యారీ కేసు కూడా వేశారు.
2020 నుంచీ కాలిఫోర్నియాలో నివసిస్తోన్నారు ప్రిన్స్ హ్యారీ. గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు తన ఆత్మకథ స్పేస్లో రాసుకొచ్చారు. ఇదే విషయాన్ని విసా దరఖాస్తులో పొందుపర్చకపోవడం- వివాదానికి కారణమైంది. దీన్ని హెరిటేజ్ ఫౌండేషన్ ప్రశ్నించింది. నిబంధనలను ఉల్లంఘించినందున విసాను రద్దు చేయాలంటూ లిఖితపూరకంగా ఫిర్యాదు చేసింది.
అక్రమ వలసదారులను డొనాల్డ్ ట్రంప్ తాజాగా దేశ బహిష్కరణ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య ఈ అంశం తాజాగా చర్చల్లోకి వచ్చింది. ది న్యూయార్క్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ దీనిపై స్పందించారు. ప్రిన్స్ హ్యారీని బహిష్కరించదలచుకోలేదని తెలిపారు. అతన్ని వదిలేస్తానని అన్నారు.
ఇప్పటికే హ్యారీ- మెఘాన్ మార్కిల్ దంపతుల మధ్య అనేక తగాదాలు, సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ ఆయనను డిపోర్ట్ చేయడం ద్వారా కొత్త సమస్యలను సృష్టించదలచుకోలేదని ట్రంప్ తేల్చి చెప్పారు. భార్యతో చాలాకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని గుర్తుచేశారు.
ప్రిన్స్ హ్యారీకి గానీ, మెఘాన్ మార్క్లే గానీ డొనాల్డ్ ట్రంప్‌పై సదభిప్రాయం లేదు. గతంలో బహిరంగంగా ఆయనను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ట్రంప్‌ను విభజనకారుడిగా, స్త్రీ ద్వేషిగా గతంలో మెఘాన్ విమర్శించారు. ట్రంప్ కూడా మెఘాన్‌పై కౌంటర్లు ఇచ్చారు. ప్రిన్స్ హ్యారీని కొరడాతో కొడుతుంటుందంటూ సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications