రేపే యుద్ధం?: ఓటు వేయగానే తేల్చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల క్రమంలో ఫ్లోరిడాలో ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయంలో తీవ్ర కలకలం రేపాయి. ఇరాన్‌పై అమెరికా దాడి చేయబోతోందా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన ఎంతో వ్యూహాత్మకంగా బదులిచ్చారు. "రేపో మాపో ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తానని అనుకుంటున్నారా? ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకవైపు భీకర యుద్ధం.. మరోవైపు 'చారిత్రాత్మక ఒప్పందం' ఆఫర్!
ఇరాన్‌పై దాడికి సై అంటునే మరో ఆసక్తికరమైన అంశాన్ని ట్రంప్ తెరపైకి తెచ్చారు. మిలటరీ చర్యలతో పాటు వారితో ఒక చక్కటి, గొప్ప ఒప్పందం కుదిరే అవకాశం కూడా లేకపోలేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వం కూడా తమతో ఒప్పందానికి సుముఖంగానే ఉందని, కానీ వారు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటారా లేదా అన్నదే అసలు సందేహమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో అమెరికా సాయుధ దళాలు సాధించిన పురోగతిని ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా ప్రశంసించారు. ఇరాన్‌కు చెందిన యుద్ధ విమానాలు, 259 నౌకలను అమెరికా నేవీ ధ్వంసం చేసిందని, ప్రస్తుతం ఆ దేశం కేవలం భారీ ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోందని వ్యాఖ్యానించారు. అయితే, సౌదీ మీడియాలో వస్తున్నట్టుగా అమెరికా ఆంక్షల ఎత్తివేతపై తాము కొత్త ప్రతిపాదనలేవీ చేయలేదని ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి.

రష్యా - ఉక్రెయిన్ పోరుకు త్వరలోనే ముగింపు?
పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య త్వరలోనే ఒక సయోధ్య కుదురుతుందని, ఆ తర్వాత రెండు దేశాలతోనూ అమెరికా వ్యాపార సంబంధాలను పునరుద్ధరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ మాట్లాడుతూ.. అక్టోబర్ 27 నుంచి ఉక్రెయిన్, రష్యాల మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఇరుదేశాల అధ్యక్షులతో ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయని కీలక విషయాన్ని బయటపెట్టారు. ప్రొఫెషనల్ డిప్లొమాట్ల కంటే కూడా మెలానియానే ఈ విషయంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారంటూ ట్రంప్ మెచ్చుకున్నారు.
డెమొక్రాట్ల అవినీతిపై ధ్వజమెత్తిన అధ్యక్షుడు
అంతర్జాతీయ వ్యవహారాలతో పాటు అమెరికా అంతర్గత రాజకీయాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. డెమొక్రాట్లు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా మిన్నెసోటా, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ వంటి నగరాల్లో అవినీతి పరాకాష్టకు చేరిందన్నారు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియపై మళ్లీ అనుమానాలు వ్యక్తం చేస్తూ.. లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఏకంగా లక్షలాది అక్రమ ఓట్లు చొరబడ్డాయని యుఎస్ అటోర్నీ ప్రాథమికంగా గుర్తించినట్లు ట్రంప్ ఆరోపించారు.














Click it and Unblock the Notifications
