పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్-స్వీట్ వార్నింగ్..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి త్వరలో పగ్గాలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు స్వదేశంతో పాటు అంతర్జాతీయంగా పరిస్దితుల్ని చక్కదిద్దేందుకు పెద్దన్న పాత్ర మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఫోన్ చేయడమే కాకుండా ఆ ఫోన్ కాల్ లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను కూడా జాయిన్ చేశారు. దీంతో ఈ ముగ్గురూ కలిసి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడుకున్నారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ట్రంప్ రష్యాఅధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కు ఫోన్ చేశారు.
ఓవైపు అమెరికాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్న డొనాల్డ్ ట్రంప్.. మరోవైపు ఇంత బిజీలోనూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కు ఫోన్ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఉక్రెయిన్ లో యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొద్దని పుతిన్ ను ట్రంప్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే యుద్దం వల్ల ఇరుదేశాలూ నష్టపోయాయని, ఇప్పుడు దానికి ఎండ్ కార్డు పెట్టాలని పుతిన్ ను ట్రంప్ అడిగినట్లు ఈ కథనం పేర్కొంది. అయితే ఈ ఫోన్ కాల్ పై ట్రంప్ ప్రతినిధులు మాత్రం మౌనంగా ఉన్నారు.

అయితే ఈ ఫోన్ కాల్ లో ట్రంప్ ఓవైపు బతిమాలుతూనే మరోవైపు ఐరోపాలో అమెరికాకు ఉన్న సైనిక సంపత్తి గురించి కూడా ఆయనకు గుర్తుచేసినట్లు సమాచారం. త్వరలో దీనిపై మరో దఫా చర్చిద్దామని కూడా పుతిన్ కు ట్రంప్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో రష్యా-ఉక్రెయిన్ యుద్దం మరింత ఉధృతం అయ్యేందుకు కారణమవుతుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications