వలసదారులకు ట్రంప్ దిమ్మదిరిగే షాక్..! కీలక ఉత్తర్వులపై సంతకం..!
అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ అక్రమ వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మరో అతి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా వలస వచ్చి నివాసం ఉంటున్న వారిని ఇప్పటివరకూ వారి స్వదేశాలకు సొంత విమానాలు ఎక్కించి మరీ తరిమేస్తున్న ట్రంప్.. దీనిపై విమర్శలు రావడంతో రూటు మార్చినట్లు తెలుస్తోంది. వలసదారులపై పెట్టే ఖర్చు తగ్గించుకుంటూ వారిని తమంతట తామే స్వదేశాలకు పారిపోయేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారుల్ని ఇప్పటికే గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ట్రంప్ సర్కార్ కు సమాచారం ఇచ్చారు. దీని ఆధారంగా ఇప్పుడు అక్రమ వలసదారులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల ప్రయోజనాల్ని నిలిపేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఇందులో ఆర్ధిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యం, ఇతర రంగాల్లో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ట్రంప్ తాజా సంతకంతో వారికి ఇవన్నీ నిలిచిపోనున్నాయి.

చట్టవిరుద్ధమైన విదేశీయుల కోసం అన్ని పన్ను చెల్లింపుదారుల-నిధుల ప్రయోజనాలను నిలిపేసేందుకు ఉద్దేశించిన ఆదేశాలపై ట్రంప్ సంతకం చేసినట్లు వైట్ హౌస్ తెలిపింది. అయితే ఏ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంటారనేది స్పష్టంగా తెలియలేదు. దేశంలోని వ్యక్తులు చట్టవిరుద్ధంగా సాధారణంగా అత్యవసర వైద్య సంరక్షణకు తప్ప అర్హత పొందరు. 1982 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా పిల్లలు ఉచిత K-12 ప్రభుత్వ విద్యకు అర్హులు.
మెక్సికోతో సరిహద్దుల్లో ఉపయోగించే సీబీపీ వన్ అనే ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ యాప్ ద్వారా 9 లక్షలకు పైగా వలసదారులు అమెరికాలోకి వచ్చారు. అలాగే ఇందులో 5 లక్షల మందికి పైగా క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వాన్లు, వెనిజులా పౌరులు ఉన్నారు. వీరంతా తమ సొంత ఖర్చుతో ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ట్రంప్ ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications