ఆర్కిటిక్ బ్లాస్ట్: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం: యూఎస్ హిస్టరీలోనే రెండోసారి
Donald Trump's swearing-in ceremony: ఇంకొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డొనాల్డ్ ట్రంప్. గత ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌ను చిత్తు చేశారు.
ఈ నెల 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీలో ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమౌతుంది.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు డొనాల్డ్ ట్రంప్-జేడీ వాన్స్ ఇనాగ్యురల్ కమిటీ ఆహ్వాన పత్రికలను పంపించింది. భారత్ సహా జీ20, బ్రిక్స్ ప్లస్.. వంటి అత్యున్నత గ్రూప్‌లల్లో సభ్య దేశాలకూ ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే అందాయి.
ఇంకో రెండు రోజుల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభం కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. వేదికను మార్చుకున్నారు. అవుట్ డోర్ నుంచి ఇండోర్‌లోకి మారిందీ కార్యక్రమం.
సాధారణంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం అవుట్ డోర్‌లో ఏర్పాటవుతుంటుంది. రాజధాని వాషింగ్టన్ డీసీలోని వెస్ట్ ఫ్రంట్ దీనికి వేదిక అవుతుంటుంది. 2020లో కూడా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇక్కడి నుంచే ప్రమాణం చేశారు.
ఈ సారి మాత్రం వెస్ట్ ఫ్రంట్‌కు బదులుగా కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలోకి మారిందీ కార్యక్రమం. ఇది ఇండోర్ వెన్యూ. చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఆర్కటిక్ బ్లాస్ట్ వల్ల చలి తీవ్రత అనూహ్యంగా పెరుగుతోందని, ఇది కొన్ని రోజుల పాటు ఉండబోతోందని ట్రంప్ చెప్పారు. ఆర్కిటిక్ బ్లాస్ దేశాన్ని కమ్మేసిందని, ఈ పరిస్థితుల్లో తన వల్ల దేశ ప్రజలు ఇబ్బందులకు గురి కావడం ఇష్టం లేదని అన్నారు. అందుకే వేదికను మార్చుకున్నట్లు వివరించారు.
వందలాది మంది పోలీసులు, భద్రత సిబ్బంది, సంప్రదాయబద్ధంగా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో వినియోగించే గుర్రాలు, ప్రమా స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి వచ్చే మద్దతుదారులు, సాధారణ ప్రజలు.. గంటల కొద్దీ చలిలో గడపాల్సిన పరిస్థితులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో వేదికను కేపిటల్ వన్ ఎరినా రొటుండాలోకి మార్చుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేదిక మారడం ఆ దేశ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 1985లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇనాగ్యురల్ సెరిమని కూడా కేపిటల్ రొటుండాలో చోటు చేసుకుంది. అప్పట్లో కూడా చలి తీవ్రతే కారణం.












Click it and Unblock the Notifications