ఇరాన్ అణుశక్తి పితామహుడి హత్య.. బుల్లెట్ల వర్షం కురిపించిన ఉగ్రవాదులు...
ఇరాన్ అణుశక్తి పితామహుడు మోసెన్ ఫఖ్రీజాదేహ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. శుక్రవారం(నవంబర్ 27) ఆయన ప్రయాణిస్తున్న కారుపై టెహ్రాన్ సమీపంలో ఉగ్రవాదులు దాడి చేశారు. మొదట మోసెన్ కారును ఉగ్రవాదులు అడ్డగించారు. దాంతో మోసెన్ బాడీగార్డులకు,ఉగ్రవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా మోసెన్ ఫఖ్రీజాదేహ్‌పై కాల్పులు జరిపారు.
తీవ్ర గాయాలపాలైన మోసెన్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ... అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆయన మరణాన్ని ధ్రువీకరించింది.
మోసెన్ హత్యకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన ప్రయాణించిన నిస్సాన్ సెడాన్ కారుకు బుల్లెట్లు దిగిన గుర్తులున్నాయి.ఇరాన్ విదేశాంగమంత్రి జావెద్ జరీఫ్ మోసెన్ హత్యపై మాట్లాడుతూ... దీని వెనకాల ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపించారు.

మోసెన్ ఫఖ్రీజాదెహ్ వృత్తి రీత్యా ఫిజిక్స్ ప్రొఫెసర్. ప్రస్తుతం ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చీఫ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అణ్వాయుధ సంబంధిత కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మోసెన్‌ను అత్యంత నమ్మకస్తుడిగా భావించేవారు.
ఏప్రిల్ 2018లో, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మోసెన్ ఫఖ్రిజాదేహ్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మోసెన్ నేత్రుత్వంలో ఇరాన్‌లో రహస్య అణ్వాయుధ కార్యకలాపాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే మోసెన్ ఫఖ్రీజాదెహ్ హత్య వెనుక బెంజిమన్ నెతన్యాహు హస్తం ఉన్నట్లు ఇరాన్ అనుమానిస్తోంది. ఇప్పటికైతే ఏ ఉగ్రవాద సంస్థ ఈ హత్యపై స్పందించలేదు.