ఎఫ్బీఐ చీఫ్ కు ఎసరు పెట్టిన ట్రంప్
అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎసరు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను సాగనంపే ఆలోచనలో ఉన్నారు. కాష్ పటేల్ పనితీరుపై తీవ్ర విమర్శలు రావడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తోన్నారు. అధిక మద్యం సేవించడం వంటి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. కాష్ పటేల్ బీరు తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ఆయనతో పాటు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు ఉండొచ్చు. కేబినెట్ ను ప్రక్షాళన చేయాలని ట్రంప్ నిర్ణయించినట్లు పొలిటికో వెల్లడించింది. పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ వైట్ హౌస్ సీనియర్ అధికారిని తన కథనానికి ఉటంకించింది. కేబినెట్ స్థాయిలో పదవులు పోగొట్టుకునే వారిలో కాష్ పటేల్ కూడా ఉండొచ్చని తెలిపింది. ఆయనపై వస్తున్న ప్రతికూల కథనాలు ట్రంప్‌ను కలవరపరుస్తున్నాయని, కేబినెట్ సెక్రెటరీ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇది మంచిది కాదనే భావనలో ట్రంప్ ఉన్నారు.

ఈ పరిణామం పరిపాలనలో విస్తృతంగా జరుగుతున్న మార్పుల మధ్య చోటుచేసుకుంది. క్రిస్టీ నోమ్, పామ్ బాండీలను ఇప్పటికే తొలగించింది వైట్ హౌస్. మేలో టాడ్ లియోన్స్ పదవీవిరమణ చేయనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖలో నంబర్ 2గా ఉంటోన్న జాన్ ఫెలాన్ కూడా పదవిని కోల్పోయారు ఇప్పటికే. ఇటీవలే పీట్ హెగ్సేత్ ఆయనను తొలగించారు. అదే సమయంలో కాష్ పటేల్ ను కూడా తొలగిస్తారని భావించినప్పటికీ.. తాత్కాలికంగా దీనికి బ్రేకులు పడ్డాయి.
కాష్ పటేల్ భవిష్యత్తుపై ఊహాగానాలు వెలువడినప్పటికీ.. వైట్ హౌస్ దీనిపై పెద్దగా స్పందించలేదు మొన్నటివరకు. ఆయనకు బహిరంగ మద్దతు తెలిపింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఓ సభ్యుడిగా కాష్ పటేల్ ను అభివర్ణించారు.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. ఇప్పుడా పరిస్థితి లేదని 'ది అట్లాంటిక్' కూడా తెలిపింది. వాషింగ్టన్‌లోని ఓ ప్రైవేట్ క్లబ్‌లో పటేల్ విపరీతంగా మద్యం సేవించారని, దీనిపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారని పేర్కొంది.
ఆయనతో పాటు మంత్రివర్గంలో కూడా కొందరిపై వేటు పడే అవకాశం ఉందని పొలిటికో అంచనా వేసింది. దీనికి గల కారణాలను విశ్లేషించింది. ఇరాన్ తో యుద్ధం అనుకున్నంత సజావుగా సాగకపోవడం, అక్కడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడం వంటి పరిణామాలను ముందుగానే అంచనా వేయలేకపోయారనే అసహనం డొనాల్డ్ ట్రంప్ లో వ్యక్తమౌతోందని, ఈ క్రమంలో కేబినెట్ సెక్రెటరీ స్థాయి నాయకులు, అధికారులపై వేటు పడొచ్చని పేర్యొంది.












Click it and Unblock the Notifications