రష్యా వైపు వెళ్లొద్దు- హుటాహుటిన ట్రావెల్ అడ్వైజరీ జారీ: రష్యన్లకు నో ఎంట్రీ
పారిస్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. అంతర్యుద్ధం మొదలైందక్కడ. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కుడిభుజంలా ఉంటూ వచ్చిన వాగ్నర్ మెర్సినరి గ్రూప్ ప్రైవేట్ ఆర్మీ.. తిరుగుబాటును లేవనెత్తింది. రష్యా సైన్యం వాగ్నర్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడమే దీనికి కారణమైంది. ఈ ఘటన తరువాత వాగ్నర్ గ్రూప్ అడ్డం తిరిగింది. అంతర్యుద్ధాన్ని మొదలుపెట్టింది.
కొన్ని గంటల వ్యవధిలోనే ఇది ఉధృత రూపాన్ని దాల్చింది. రెండు నగరాలు- రొస్టొవ్, వొరొనెజ్‌ను సైతం వాగ్నర్ గ్రూప్ సొంతం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా నగరాల్లో పహారాలో ఉన్న రష్యా సైనికులు- ఈ ప్రైవేట్ ఆర్మీకి లొంగిపోయింది. వొరొనెజ్ టౌన్ శివార్లలోని ఆయిల్ డిపో ధ్వంసమైంది. ఇందులో నుంచి దట్టమైన పొగలు వెలువడటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల‌్‌గా మారాయి.

అటు రాజధాని మాస్కో నగరానికి వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ ఆర్మీ సమీపిస్తోంది. మాస్కోకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపెట్స్క్ రీజియన్‌కు ఈ ఆర్మీ చేరుకుంది. వాగ్నర్ ఆర్మీని నిలువరించడానికి రష్యా సైన్యం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. సొంత నగరాలపై బాంబు దాడులు చేయడానికి వారు అంగీకరించట్లేదు. లిపెట్స్క్ రీజియన్‌లో మోహరించిన రష్యా సైనికుల్లో సుమారు 180 మంది స్వచ్ఛందంగా తప్పుకొన్నట్లు వార్తలు వస్తోన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో సరిహద్దులను పంచుకుంటోన్న పలు దేశాలు అప్రమత్తం అయ్యాయి. తమ దేశ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసుకున్నాయి. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అదనపు భద్రత బలగాలను మోహరింపజేశాయి. రష్యాకు ఆనుకునే ఉన్న లాత్వియా.. తన దేశ సరిహద్దులను మూసివేసింది. రష్యన్లు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధించింది. అటువైపు నుంచి వ్యక్తులు గానీ, వాహనాలను గానీ రానివ్వొద్దంటూ ఆదేశాలను జారీ చేసినట్లు లాత్వియా విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు తెలిపాయి.

అటు ఫ్రాన్స్ సైతం కీలక నిర్ణయాలను తీసుకుంది. రష్యాకు వెళ్లొద్దంటూ తమ దేశ పౌరులను సూచించింది. ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. వ్యాపార కార్యకలాపాల కోసం ఇప్పటికే రష్యాకు వెళ్లిన తమ దేశ ప్రజలు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని పేర్కొంది. రష్యాలో నివసిస్తోన్న వారు తక్షణమే రాయబార కార్యాలయానికి తమ పూర్తి వివరాలను అందజేయాలని కోరింది. ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని పేర్కొంది.












Click it and Unblock the Notifications