ట్విట్టర్‌కు బిగ్ షాక్ - ఊహించని దెబ్బకు టోటల్ ఢమాల్..!!
వాషింగ్టన్: టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు ఊహించని దెబ్బ. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ఒకదారి వెంట ఒకటిగా కీలక పరిణామాలు సంభవిస్తోన్నాయి. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గల ట్విట్టర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ అడుగు పెట్టిన మరుసటి రోజే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్, లీగల్ సెల్ చీఫ్ విజయ గద్దెపై వేటు పడగా- రెండో రోజు మరో బిగ్ షాక్ తగిలింది.

గడువు కంటే ముందే..
ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకోవడానికి ఉద్దేశించిన 44 బిలియన్ డాలర్ల డీల్‌ను ఎలాన్ మస్క్ ఇటీవలే పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీని తరువాత ఆయన ఆఫీస్‌లో కూడా అడుగు పెట్టారు. లాంఛనంగా ఈ ప్రతిపాదనలకు ముగింపు పలికారు. టేకోవర్ కార్యక్రమాలకు తెర దించినట్టయింది. అమెరికా న్యాయస్థానం నిర్దేశించిన గడువు కంటే ముందే టేకోవర్ ప్రక్రియను ముగిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్విట్టర్ ఆఫీస్‌లోకి అడుగు పెట్టిన తరువాత తనను తాను చీఫ్ ట్వీట్‌గా అభివర్ణించుకున్నారు ఎలాన్ మస్క్.

పరాగ్ అగర్వాల్ అవుట్..
ఈ పరిణామాల తరువాత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుడ్‌బై చెప్పనున్నారు. ట్విట్టర్.. ఎలాన్ మస్క్ చేతికి వెళ్లిన నేపథ్యంలో తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు లీగల్, పాలసీ చీఫ్ విజయ గద్దె కూడా తప్పుకోనున్నారు. ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్గెట్ సైతం కంపెనీని వీడనున్నారు. 2012 నుంచీ సీన్ ఎడ్గెట్.. ట్విట్టర్‌లో కొనసాగుతున్నారు.

జనరల్ మోటార్స్ కీలక నిర్ణయం..
అదే సమయంలో- అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ జనరల్ మోటార్స్.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ట్విట్టర్‌కు ఇచ్చే వాణిజ్య ప్రకటనలను బంద్ చేయనున్నట్లు తెలిపింది. మిచిగాన్ స్టేట్ డెట్రాయిట్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న లార్జెస్ట్ ఆటోమేకర్ కంపెనీ ఇది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీకి కాంపిటీటర్‌గా గుర్తింపు ఉంది.

కస్టమర్ కేర్ సపోర్ట్ మినహా..
అడ్వర్టయిజ్‌మెంట్ల నిలిపివేత తాత్కాలికమేనని చెబుతున్నప్పటికీ- మళ్లీ ఎప్పటికి పునరుద్ధరిస్తారనే విషయాన్ని స్పష్టం చేయలేదు జనరల్ మోటార్స్ యాజమాన్యం. ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌ను తమ కస్టమర్ కేర్ సపోర్టింగ్ కోసమే వినియోగించుకోనున్నట్లు తెలిపింది. వాణిజ్య ప్రకటనలను ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.

ఆదాయానికి గండి
కాగా- జనరల్ మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మిగిలి ఆటోమొబైల్, కార్ల తయారీ కంపెనీలు కూడా అవే బాటలో నడిచే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఫోర్డ్ మోటార్స్, స్టెల్లాంటిస్, వేమోకు చెందిన ఆల్ఫాబెట్ కూడా ట్విట్టర్‌కు ఇచ్చే తమ వాణిజ్య ప్రకటనలను నిలిపివేయొచ్చనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే- వాణిజ్య ప్రకటనల రూపంలో ట్విట్టర్‌కు అందే ఆదాయానికి భారీగా గండిపడినట్టే అవుతుంది.

ఫ్రీ ఫర్ ఆల్ హెల్‌స్కేప్ కామెంట్స్
యాడ్స్ ఇచ్చే వారి కోసం ట్విట్టర్‌ను ఫ్రీ ఫర్ ఆల్ హెల్‌స్కేప్‌గా మార్చలేనంటూ ఎలాన్ మస్క్ ఓ ప్రకటన చేశాడు. దీని తరువాతే జనరల్ మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుందని అమెరికా మీడియా అంచనా వేస్తోంది. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం కూడా దీనికి ఓ కారణం అయి ఉండొచ్చని భావిస్తోంది. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్తుందనే ఉద్దేశంతో ఈవీ స్టార్టప్ ఫిస్కర్ సీఈఓ హెన్రిక్ ఫిస్కర్ తన అకౌంట్‌ను ఇదివరకే డిలెట్ చేశారు.












Click it and Unblock the Notifications