గూగుల్ అల్ఫాబెట్‌లో 12 వేల ఉద్యోగాల కోత: సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగాల కోతను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా.. తాజాగా, ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మాతృ సంస్త అల్ఫాబెట్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

గూగుల్ అల్ఫాబెట్‌లో 12వేల ఉద్యోగల కోత
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 12వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారమిచ్చారు. ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు ప్రతిభను, మూలధనాన్ని అధిక ప్రాధాన్యతల వైపునకు మళ్లించేందుకు సమయం ఆసన్నమైందని తెలిపారు.

ఉద్యోగాల కోతపై సుందర్ పిచాయ్
రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ టీంకు చెందిన విభాగాలతోపాటు ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ కోతలు ఉండనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ కోతలు ఉండబోతున్నాయని, అమెరికాలో సిబ్బందిపై వెంటనే ప్రభావం ఉండదనుందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అయితే, తదుపరి ఉపాధి చూసుకునే వారికి సాయం అందిస్తామని తెలిపారు. అమెరికాలో ఉండే ఉద్యోగులకు 60 రోజుల పూర్తి నోటిఫికేషన్ కాలానికి వేతనం చెల్లించనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.

తనదే పూర్తి బాధ్యత అంటూ సుందర్ పిచాయ్
పరిహార ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతోాపటు గూగుల్ లో పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాల చొప్పున వేతనం చెల్లించనున్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి 2022కి సంబంధించి బోనస్ తోపాటు వెకేషన్ టైమ్, ఆరు నెలలపాటు హెల్త్ కేర్, జాబ్ ప్లేస్ మెంట్ సర్వీసులు, ఇమ్మిగ్రేషన్ సపోర్ట్ అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న దానికంటే భిన్నమైన ఆర్థిక వాస్తవికత కోసం ఇటీవలి సంవత్సరాలలో కంపెనీ హెడ్‌కౌంట్‌ను వేగంగా విస్తరించిందని చెప్పారు. ఇక్కడ మమ్మల్ని నడిపించిన నిర్ణయాలకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని సుందర్ పిచాయ్ తెలిపారు. మరోవైపు, ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్ కార్ప్ 10,000 మంది కార్మికులను తొలగిస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఈ కోతలు చోటు చేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications