రష్యాలోకి సీక్రెట్ గా వందల డ్రోన్లు-ఒకేసారి దాడి-అబ్బురపరిచిన ఉక్రెయిన్ వ్యూహం..!
మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్దంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ తమపై రష్యా చేస్తున్న దాడుల్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్న ఉక్రెయిన్ ఒక్కసారిగా జూలు విదిల్చింది. నేరుగా యుద్దం చేసి ప్రయోజనం లేదనుకుందో ఏమో రహస్యంగా మొదలుపెట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ ను పక్కాగా అమలు చేసి చూపించింది. దీంతో రష్యా ఏకకాలంలో 40కి పైగా యుద్ధ విమానాల్ని కోల్పోయింది. దీంతో చరిత్రలో ఇదో పెరల్ హార్బర్ దాడిగా చెబుతున్నారు.
ఇవాళ రష్యా-ఉక్రెయిన్ మధ్య టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. దీనికి సరిగ్గా 24 గంటలకు ముందు రష్యా ఎయిర్ బేస్ లను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకుపోయాయి. వందల సంఖ్యలో ఊడిపడ్డ డ్రోన్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక రష్యా చేతులెత్తేసింది. ఫలితం రష్యా యుద్ధ విమానాల శ్రేణిలో 30 శాతానికి పైగా నష్టపోయింది. ఇంతకీ అసలు ఇన్ని డ్రోన్లు రష్యాలోని 4 వేల కిలోమీటర్ల లోపలికి ఎలా ప్రవేశించాయన్నది ఆసక్తికరంగా మారింది.

రష్యాలోని కీలక ప్రాంతాలపై, ముఖ్యంగా తమపై దాడులకు యుద్ధ విమానాల్ని, ఇతర సామాగ్రిని ఉంచుతున్న ఎయిర్ బేస్ లపై దాడి చేయాలని ఉక్రెయిన్ ఎప్పుడో నిర్ణయించుకుంది. దీని అమలుకు డ్రోన్లే సరైన మార్గమని భావించింది. భారీ ఎత్తున షిప్పింగ్ కంటెయినర్ల ద్వారా రహస్యంగా ఈ రిమోట్ డ్రోన్లను రష్యాలోని ఎయిర్ బేస్ లకు పంపేసింది. అంతే ఒక్కసారిగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ ను ప్రారంభించింది. ఉక్రెయిన్ లో కూర్చుని రిమోట్ లు నొక్కుతుంటే రష్యా ఎయిర్ బేస్ లలో విమానాలు ఎగిరిపడ్డాయి.
ఇలా 100కి పైగా డ్రోన్లు షిప్పింగ్ కంటెయినర్ల నుంచి గాల్లోకి ఎగిరి రష్యా వైమానిక స్థావరాలపైనుంచి యుద్ద విమానాలపైకి బాంబుల్ని జార విడిచాయి. 1941లో హవాయిలో అమెరికా నౌకాదళంపై ఇంపీరియల్ జపనీస్ నేవీ ఇలాగే ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడులను 'పెర్ల్ హార్బర్' గా అప్పట్లో పిలిచింది. దాన్ని ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రిపీట్ చేసారు. అప్పట్లో జపాన్ నేవీ చేసిన పెరల్ హార్బర్ దాడి ప్రపంచాన్ని యుద్దంలోకి నెట్టింది. ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్ చేసిన దాడి ఎటువైపుకు దారి తీస్తుందో అన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతోంది.












Click it and Unblock the Notifications