Hurricane Milton: ఫ్లోరిడాలో హరికేన్ మిల్టన్ బీభత్సం..!!
Hurricane Milton:అమెరికాను మరో సహజ విపత్తు కబళించేందుకు సిద్ధంగా ఉంది. ఆ దేశంలోని ఫ్లోరిడాపై హరికేన్ మిల్టన్ పంజా విసిరేందుకు దూసుకొస్తోంది. హెలెన్ తుఫాను సృష్టించిన బీభత్సం మరవకముందే అమెరికా దేశాన్ని మరోసారి విచ్ఛిన్నం చేసేందుకు హరికేన్ మిల్టన్ కోరలు చాస్తోంది. బలహీనపడ్డ హరికేన్ మిల్టన్ తుపాను స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి తీరం దాటింది. దీన్ని తీవ్రత ఆధారంగా కేటగిరీ 3 కిందకు చేర్చింది వాతావరణశాఖ.
హరికేన్ మిల్టన్ సృష్టిస్తున్న బీభత్సంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. 20 లక్షలకు పైగా గృహాల్లో విద్యుత్ సరఫరా లేక అక్కడి ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. ఇక గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంలో భారీ ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకరమైన తుపానుగా హరికేన్ మిల్టన్ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. స్థానిక కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటలకు ఫ్లోరిడాలోని సరసోటా నగరంలో హరికేన్ మిల్టన్ తీరం తాకింది. దీంతో ఫ్లోరిడా తీర ప్రాంతంతో పాటు ఎక్కువ జనాభా ఉన్న తంపా నగరం, సెయింట్ పీటర్స్‌బర్గ్,సరసోటా, ఫోర్ట్ మైయర్స్ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది.

తీరంకు చేరువయ్యే కొద్దీ గాలి వేగం కాస్త తగ్గినప్పటికీ, గత రెండ్రోజుల్లో మెక్సికో తీరాన్ని అతలాకుతలం చేసింది హరికేన్ మిల్టన్. ఫ్లోరిడా రాష్ట్రాన్ని 12 రోజుల వ్యవధిలో రెండు భయానక తుపానులు బీభత్సం సృష్టించాయి. హెలెన్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోక ముందే హరికేన్ మిల్టన్ రాకాసిలా దూసుకురావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బుధవారం రాత్రి తంపా నగరానికి ఆకస్మకి వరద హెచ్చరికలు జారీచేయడం జరిగింది. దీంతో అక్కడి ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.ఇక సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 42 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.ఇక దక్షిణ ఫ్లోరిడాకు పలుమార్లు సుడిగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇక భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.ఇక ఫ్లోరిడాలోని 15 కౌంటీల్లో నివసిస్తున్న 70 లక్షల మంది ప్రజలను వెంటనే తమ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక తుపాను దృష్ట్యా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేస్తున్నట్లు సెయింట్ పీటర్స్‌బర్గ్ మేయర్ కెన్ వెల్చ్ వెల్లడించారు. మొత్తానికి హెలెన్ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే హరికేన్ మిల్టన్ విరుచుకుపడుతుండటంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు.












Click it and Unblock the Notifications