భార్య కోసం ఏ భర్త చేయని డే'రింగ్' పని.. 18 టన్నుల చెత్తతో !
భార్యల మీద ప్రేమను భర్తలు ఎన్నో రకాలుగా వ్యక్తపరిచిన సంఘటనలు చూసే ఉంటాం. తన భార్య ముంతాజ్ కోసం షాజహాన్ ఏకంగా తాజ్ మహాల్ కూడా కట్టారు. ఈ తరహాలోనే వారి స్థాయిలో ఎందరో భర్తలు తమ భార్యల మీద ప్రేమను బయటపెట్టారు. ఇప్పుడు కూడా కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో భార్య కోసం భర్త చేసిన ఓ అసాధ్యమైన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏం జరిగిందంటే..
తన జీవిత భాగస్వామి పొగొట్టుకున్న 'వెడ్డింగ్ రింగ్స్' కోసం భర్త ఏకంగా 18 టన్నుల చెత్తను వెతికాడు. చివరికి వాటిని తిరిగి దొరకడంతో ఆ దంపతుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. దీంతో ఈ విషయం వారి సన్నిహితుల ద్వారా బయటికి రాగా ఆ భర్త చేసిన డేరింగ్ పని పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువర్తితున్నాయి.

ఎలా జరిగిందంటే..?
స్టీవ్ వాన్ ఎసెల్‌డిక్ భార్య జిన్నీన్ ఒక రోజు గార్డెన్‌లో పని చేస్తూ చేతిలో ఉన్న పాప్‌కార్న్ కిందపడింది. వాటిని సేకరించి చెత్త సంచిలో వేసేసింది. అయితే ఆ తొందరలో తన చేతిలో ఉన్న పెళ్లి ఉంగరాలూ చెత్త సంచిలో పడిపోయాయి. ఆమెకు ఈ విషయం తెలియలేదు. తరువాత ఆ చెత్త సంచి పారిశుద్ధ్య కార్మికులు తీసుకెళ్లారు.
సీసీ కెమెరాల్లో బయటపడ్డ నిజం..
ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తరువాతే అసలు నిజం బయటపడింది. జిన్నీన్ చేతికి ఉన్న ఉంగరాలు ఆ సమయంలోనే కనిపించకపోవడం గమనించిన స్టీవ్, అవి చెత్త సంచిలో పడ్డాయనే నమ్మకానికి వచ్చాడు. అయితే అప్పటికే ఆ సంచి డంపింగ్ యార్డ్ చేరిపోయింది. దాంతో భార్య "ఇక దొరకవు" అని నిరాశ వ్యక్తం చేసినా.. స్టీవ్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
18 టన్నుల చెత్తలో వెతుకులాట..
కాగా మరుసటి రోజు ఉదయం స్టీవ్ నేరుగా డంపింగ్ యార్డుకు వెళ్లాడు. అక్కడి అధికారులకు జరిగిన విషయాన్ని వివరించగా, వారు సాయం చేయడానికి ఒప్పుకున్నారు. గ్లౌజ్‌లు వేసుకొని, పార చేతపట్టి అతను చెత్తలో వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో యార్డులో దాదాపు 18 టన్నుల వ్యర్థాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు డంపింగ్ యార్డు కాంట్రాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. "అతన్ని చూసి మొదట భార్యకు కొత్త ఉంగరం కొంటే బాగుంటుందని అనిపించింది. కానీ అతని పట్టుదల చూసి నా జేసీబీతో సహాయం చేశాను" అని చెప్పాడు. జేసీబీతో చెత్తని పక్కకు జరిపి వెతికే పనిని సులభతరం చేశారు.
కొన్ని సంచులను గుర్తించిన స్టీవ్ వాటిలో వెతకగా.. మొదట ఒక ఉంగరం దొరికింది. కొద్దిసేపటికే మరో ఉంగరమూ లభించింది. అయితే ఈలోగా ఉంగరాలు దొరకవనే నమ్మకంతో భార్య జిన్నీన్ మెటల్ డిటెక్టర్ కొనడానికి వెళ్ళింది. కానీ భర్త కాల్ చేసి "ఉంగరాలు దొరికాయి" అన్న వెంటనే ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట.
ఈ సంఘటన సోషల్ మీడియాలో అవ్వగా.. నెటిజన్లు "ఇలాంటి భర్త దొరకడం అదృష్టం" అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు "ప్రేమంటే ఇదే" అంటూ స్టీవ్ పట్టుదలను ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications