International Friendship day 2022:ఆగస్టులో జరుపుకునేది జూలై 30న ఎందుకు జరుపుకుంటున్నాం..?
స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం అనే ఓ తెలుగు పాట నిత్యం వింటుంటాం. అయితే ఈ రోజు అంటే జూలై 30వ తేదీన ఈపాటను మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. కారణం జూలై 30వ తేదీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. ఇంగ్లీషులో ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్‌డే అని పిలుస్తున్నాం.స్నేహం అనేది ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధంగా పరిగణించబడుతుంది. ఇది రక్తసంబంధం కాకపోయినప్పటికీ మనుషుల హృదయాంతరంలో నుంచి పుట్టుకొస్తుంది. ఒక వ్యక్తిని ఒంటరి తనం అనే అనుభూతి నుంచి బయటకు తీసుకొచ్చేదే స్నేహం. మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు ఎవరు వెంట ఉన్నా లేకున్నా.. ఎవరు తోడున్నా లేకున్నా.. స్నేహం మాత్రం చివరివరకు ఉంటుంది.

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చింది..?
జాతి, రంగు, లింగం, ప్రాంతం, మతం అనే అంశాలతో సంబంధం లేకుండా వివిధ దేశాల ప్రజల మధ్య బలమైన స్నేహం ఏర్పడాలనే మంచి ఉద్దేశంతో 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ప్రకటించింది.హింసను తిరస్కరించి, మంచి విలువలు, శాంతితో కూడిన మెరుగైన సమాజనిర్మాణం కోసం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను యూనెస్కో ప్రతిపాదించింది.అంతేకాదు రెండు దేశాల మధ్య పొరపచ్చాలు, వైషమ్యాలు తొలిగిపోయి కలిసి మెలిసి ఉండాలన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.

జూలై , ఆగస్టులో వేర్వేరు స్నేహ దినోత్సవాలు
ప్రపంచ దేశాలు రెండు సార్లు అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. భారతదేశంతో సహా బంగ్లాదేశ్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలు ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే, అనేక ఇతర దేశాల్లో, జూలై 30న అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా జరుపుకుంటాయి

అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
అంతర్జాతీయ స్నేహ దినోత్సవం 1935లో అమెరికాలో ప్రారంభమైంది. ఆగస్ట్ మొదటి ఆదివారం నాడు, ఒక వ్యక్తి అమెరికా ప్రభుత్వం చేత చంపబడ్డాడని చెబుతారు. ఇది తెలిసిన హతుడి స్నేహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పటి నుంచి ఆ రోజును ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్నేహం యొక్క స్ఫూర్తిని సజీవంగా ఉంచడానికి , స్నేహం యొక్క మధురక్షణాలను చిరస్మరణీయంగా మార్చడానికి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications