బిగ్ యూటర్న్- క్షమాపణలు చెప్పిన ఇరాన్: దాడులకు పుల్ స్టాప్
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ పరిణామాల మధ్య ఇరాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తోటి గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్.. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. గల్ప్ దేశాలపై జరిగిన దాడుల విషయంలో చింతిస్తున్నామని తెలిపారు. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఆయా ఆక్రమించాలనే ఉద్దేశ్యం గానీ, సరిహద్దులను దాటుకుని వాటి భూభాగంపైకి చొచ్చుకుని రావాలనే ఆలోచన గానీ ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు.

గల్ఫ్, మిడిల్ ఈస్ట్ లోని ఏ దేశంపైనా ఇకపై క్షిపణి దాడులు జరపకూడదని, వీటిని తక్షణమే నిలిపివేయాలని కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నట్లు పెజాష్కియన్ ప్రకటించారు. ఆయా దేశాలు తమపై మిస్సైళ్లు సంధిస్తే తప్ప, తాము దాడి చేయబోమనీ తేల్చి చెప్పారు. కౌన్సిల్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ఆయన ఈ సందర్భంగా దేశ ప్రజలకు వివరించారు. ఇటీవల దాడుల వల్ల ప్రభావితమైన ఆయా గల్ఫ్ దేశాలకు అండగా నిలవాలని కూడా నిర్ణయించామని చెప్పారు.
తమపై దాడి చేయడం వల్ల ప్రాంతీయ అశాంతి ఏర్పడుతుందని, అందుకే ఈ విషయంలో తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది అక్కడి దేశాలేనని పెజెష్కియన్ పిలుపునిచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల దాడులు జరిపిన నేపథ్యంలోనే ఇరాన్ సైతం గల్ఫ్ లోని దాదాపుగా అన్ని దేశాలపైనా ఎదురు దాడులు కొనసాగిస్తూ వస్తోంది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఆయా దేశాల్లోని అమెరికా బేస్ లు, ఎంబసీలు, రాయబార కార్యాలయాలపై మాత్రమే దాడులు చేశామని పెజాష్కియన్ వివరించారు.
ఇవి అమెరికా, ఇజ్రాయెల్ దూకుడు చర్యలకు ప్రతీకారంగానే అభివర్ణించారు. షరతులు లేని లొంగుబాటును అంగీకరించాలనే అమెరికా డిమాండ్‌ను కూడా పెజెష్కియన్ కొట్టిపారేశారు. షరతులు లేకుండా లొంగిపోతామనే వారి కలలను వారు సమాధి చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన ద్వారా టెహ్రాన్ తన పొరుగు దేశాలకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రాంతీయ సంఘర్షణ మధ్య అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కఠినమైన వైఖరిని కొనసాగిస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేసినట్టయింది.












Click it and Unblock the Notifications