ఇజ్రాయెల్ అనూహ్య చర్య- బాంబుల వర్షం
Israel attack on Iran: ఇరాన్‌పై గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ దాడికి దిగింది ఇజ్రాయెల్. మిస్సైళ్ల వర్షాన్ని కురిపించింది. ఇటీవలే తమ దేశంపై నిర్వహించిన దాడులకు ప్రతీకారంగా బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది.
ప్రత్యేకించి- ఇరాన్ సైన్యం ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఆర్మీ, ఎయిర్ బేస్ క్యాంప్‌లపై ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎంత మేర ప్రాణనష్టం సంభవించిందనేది ఇంకా తెలియరావట్లేదు. భారీగా ఆస్తినష్టం జరిగిందనేది- దీనికి సంబంధించిన వీడియోల వల్ల స్పష్టమౌతోంది. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఇప్పటివరకు స్పందించలేదు. ఎలాంటి ప్రకటన చేయలేదు.

భారత కాలమానం ప్రకారం- అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట సమయంలో ఇజ్రాయెల్ ఈ వైమానిక దాడులకు దిగింది. దీనికోసం డ్రోన్లు, అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ను వినియోగించింది. టెహ్రాన్, నగర శివార్లు, పరిసర పట్టణాల్లో పలు చోట్ల సైరెన్ మోతలు డ్రోన్లు, యూఏవీలు దూసుకెళ్లిన శబ్దాలు వినిపించాయి. భారీ పేలుళ్లు ఇరానీయులను కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
ఈ దాడులను ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారిక వార్తా సంస్త తన్సీమ్ న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది. టెహ్రాన్ సమీపంలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపింది. ఇజ్రాయెల్ అకారణంగా దాడలకు పాల్పడుతోందని, కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. ఆ దేశం యుద్ధాన్ని కోరుకుంటోందంటూ మండిపడింది.

ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా దాడులు సాగించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అని పేరుతో ఇజ్రాయెల్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. 200ల వరకు అత్యాధునిక క్షిపణులను సంధించింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నది. కీలకమైన ఎఫ్- 35 ఫైటర్ జెట్స్ ఎయిర్ బేస్ సైతం ధ్వంసమైంది.
ఈ దాడుల కోసం అత్యంత శక్తిమంతమైన హైపర్ సోనిక్ మిస్సైల్ ఫతా-2ను ఇరాన్ వినియోగించింది ఇరాన్. ఇజ్రాయెల్‌కు అత్యంత అధునాతన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఈ హైపర్ సోనిక్‌ను నిలువరించలేకపోయింది. మొస్సాద్, ఎఫ్ 35 జెట్ ఫైటర్స్ ఎయిర్ బేస్ దెబ్బతినడానికి ఈ మిస్సైలే కారణమనే అంచనాలు ఉన్నాయి.

మొన్నటివరకు లెబనాన్, గాజాలపై యుద్ధానికి దిగింది ఇజ్రాయెల్. దీని తరువాత ఇప్పుడు ప్రతీకారంగా ఇరాన్‌పై ఎదురుదాడులకు దిగింది. ఆర్మీ, ఎయిర్ బేస్‌లపై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ క్రమంలో ఇరాన్ సైన్యం కొన్ని డ్రోన్లు, అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ను కూల్చివేయగలిగింది.












Click it and Unblock the Notifications