ఇరాన్ అధినేతను చంపేద్దామనుకున్నాం.. కానీ.. ! ఇజ్రాయెల్ మంత్రి షాకింగ్..!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం ముగిసిపోయింది. ఇరు దేశాలూ అమెరికా సూచన మేరకు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే యుద్ధం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్ని మాత్రం ఇరు దేశాలూ మర్చిపోలేకపోతున్నాయని తాజాగా వెల్లడైన అంశాలను బట్టి అర్దమవుతోంది. ఇరాన్ తో యుద్ధం సందర్భంగా ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీని హతమార్చేందుకు తాము ప్లాన్ చేసినట్లు ఇజ్రాయెల్ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు.
ఇరాన్ తో జరిగిన 12 రోజుల యుద్దంలో ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమైనీని హతమార్చేందుకు వ్యూహం రచించామని, కానీ ఆయన ఆలోపే బంకర్ లోకి వెళ్లిపోయి తప్పించుకున్నారని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఆయన కమాండర్లతో సంబంధాల్ని తెంచుకుని చాలా లోతుగా భూగర్భంలోకి వెళ్లి దాక్కున్నారన్నారు. యుద్ధం జరిగినన్ని రోజులు ఖమేనీ కోసం ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా గాలించిందన్నారు. ఇరాన్ లో అధికార మార్పిడి తమ లక్ష్యం కాదని ఖమైనీని చంపి సంక్షోభానికి పూర్తి ముగింపు పలకడమే అన్నారు.

ఖమేనీని హతమార్చేందుకు అమెరికా అనుమతి తీసుకున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. దీనికి అగ్రరాజ్యం అనుమతి అవసరం లేదన్నారు. గతంలో తాము ఇరాన్ లో దాక్కున్న హమాస్ నేత హసన్ నస్రల్లాను హతమార్చామని, అదే తరహాలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ను సైతం హతమార్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికీ ఖమైనీని దాక్కుని సురక్షితంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణమంత్రి సూచించారు. నస్రల్లా ఘటన నుంచి ఆయన పాఠాలు నేర్చుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications