ఇక ఇజ్రాయెల్ ఆక్రమిత గాజా- బిగ్ స్టెప్
ఇన్నేళ్లూ గాజాలోని హమాస్ మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులకు దిగుతూ వచ్చిన ఇజ్రాయెల్.. మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఈ దఫా గాజను స్వాధీనం చేసుకోనుంది. ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టింది కూడా. హమాస్ మిలిటెంట్ల చెర నుంచి గాజాను విడిపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.
గాజాను టేకోవర్ చేసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సంపూర్ణ అధికారాలను ఇచ్చింది ఆ దేశ మంత్రివర్గం. ఈ మేరకు దీనికి సంబంధించిన ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆ దేశ సెక్యూరిటీ కేబినెట్ సంతకం చేసింది.

హమాస్‌ను సమూలంగా ఓడించడం, వారి చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ పౌరులను విడిపించుకోవడం, మానవత దృక్పథం కింద అక్కడి పౌరులకు ఆహారం, మెడిసిన్, నిత్యావసర సరుకుల పంపిణీ, ఇతర సహాయ సహకారాలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని మంత్రిమండలి వివరించింది.
గాజా నగరాన్ని స్వాధీనపర్చుకోవడానికి ప్రధాని నెతన్యాహు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించినట్లు వివరించింది. దీంతో- ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి త్వరలోనే రంగంలోకి దిగబోతోన్నాయని అంచనావేసింది.
యుద్ధ ప్రాంతాలకు వెలుపల ఉన్న పౌరులకు మానవతా సహాయం అందించే బాధ్యతను కూడా డిపెన్స్ ఫోర్సెస్ తీసుకుంటుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ ప్రణాళికకు మెజారిటీ కేబినెట్ మంత్రులు మద్దతు పలికారు. హమాస్‌ను మట్టుబెట్టడం, వారి వద్ద బందీలుగా ఉన్న వారిని తిరిగి తీసుకురావడానికి ఇంతకంటే మరో మార్గం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది.
గాజాను ఆక్రమించుకోవడం లేదా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ లోకి విలీనం చేసుకోవాలని తాము కోరుకోవట్లేదంటూ నెతన్యాహు ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ ప్రకటన ఇచ్చిన సరిగ్గా వారం రోజుల్లోనే దీనికి పూర్తి భిన్నంగా ఆ దేశ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హమాస్‌ను నాశనం చేయడం, గాజా మొత్తాన్ని కూడా అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే తమ లక్ష్యమని నెతన్యాహు గతంలో పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత గాజా భద్రత వ్యవహారాలను మాత్రమే తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తోన్నట్లు చెప్పారు.
మానవత దృక్పథం కింద గాజాకు రెండు మిలియన్ టన్నులకు పైగా ఆహారాన్ని పంపించినప్పటికీ- దాన్ని హమాస్ మిలిటెంట్లు అడ్డుకున్నారని ఆరోపించారు. గాజాను పాలస్తీనా అథారిటీకి లేదా హమాస్‌కు ఎప్పటికీ అప్పగించబోమని, తాత్కాలిక ప్రభుత్వానికి మాత్రమే ఈ బాధ్యత ఉంటుందని అన్నారు.
గాజాపై సాగిస్తోన్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలనుకుంటున్నామని నెతన్యాహు స్పష్టం చేశారు అప్పట్లో. హమాస్ లొంగిపోయి, ఆయుధాలను విడిచిపెట్టి, బందీలను విడుదల చేసిన మరుసటి రోజే ఈ యుద్ధం ముగుస్తుందని చెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లు కూడా హమాస్‌తో పోరాడుతున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications