చైనా కమ్యూనిస్ట్ పార్టీలో చేరనున్న ప్రముఖ సినీనటుడు జాకీ చాన్!
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ సినీ నటుడు జాకీ చాన్.. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల చైనా సినీ ప్రముఖుల మధ్య జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జాకీ చాన్ తన మనసులోని మాటను బయటపెట్టారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం పేర్కొంది.
సీపీసీ శతాబ్ది వేడుకల సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేసిన ప్రసంగంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. అయితే, ఈ సందర్భంగా జాకీచాన్.. సీపీసీ విధానాలను ప్రశంసించారు. సీపీసీ గొప్పతనం కళ్లముందే కనపడుతోంది. అది ఏం చెబుతుందో. ఏ వాగ్ధానం చేస్తోందో. వాటిని తప్పక నెరవేరుస్తుంది. అందుకు వందేళ్లు అవసరం లేదు. కొన్ని దశాబ్దాల సమయం చాలు అని జాకీ చాన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అంతేగాక, తాను ఆ పార్టీ(కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా-సీపీసీ) పార్టీ సభ్యున్ని కావాలనుకుంటున్నట్లు జాకీ చాన్ అన్నారని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. కాగా, వివిధ రంగాల్లోని ప్రముఖులను సలహాదారులుగా నామినేట్ చేస్తూ సీపీసీ ఏర్పాటు చేసిన 'చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్'లో జాకీ చాన్ కూడా ఒక సభ్యుడిగా ఉండటం గమనార్హం.
ప్రస్తుతం జాకీచాన్.. చైనా ఫిలిం అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కాగా, హాంకాంగ్‌లో నివసిస్తున్న జాకీ చాన్ ముందు నుంచీ సీపీసీకి మద్దతు పలుకుతున్నారు.
హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యవాదుల నిరసనను అణిచివేయడానికి సీపీసీ చేపట్టిన చర్యలను కూడా ఈ 67 ఏళ్ల సినీనటుడు సమర్థించారు. ఈ విషయంలోనే జాకీ చాన్‌పై హాంకాంగ్ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నలువైపుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా జాకీ చాన్ సీపీసీకి మద్దతు పలకడం ఆపలేదు.












Click it and Unblock the Notifications