బస్సు డ్రైవర్ నుంచి డిక్టేటర్ వరకూ.. వెనీజులా అధ్యక్షుడు మదురో జర్నీ ఇదే..
వెనీజులాలో నికోలస్ మదురో శకం ముగిసింది. వెనీజులాపై అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. వెనీజులా రాజధాని కరాకస్ పరిసర ప్రాంతాల్లోని ఏడు చోట్ల భారీ పేలుళ్లు జరిపింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. బస్సు డ్రైవర్ నుంచి వెనీజులా డిక్టేటర్ గా ఆయన ఎదిగారు. కొంతకాలం యూనియన్ ఆర్గనైజర్ గానూ మదురో పనిచేశారు.
నికోలస్ మదురో.. వెనీజులా రాజధాని కరాకస్ లో నవంబర్ 23, 1962లో జన్మించారు. హై స్కూల్ వరకూ అక్కడే చదివిన మదురో.. కమ్యూనిస్టు భావాల కింద 1982 లో క్యూబాకు వెళ్లారు. ఆ తర్వాత మదురో బస్ డ్రైవర్ గా పనిచేశారు. ఆ తర్వాత యూనియన్ ఆర్గనైజర్ గానూ సేవలందించారు. హ్యూగో చావెజ్ వెనీజులా అధ్యక్షుడైన తర్వాత లా మేకర్ గా మదురో అతనికి సాయపడ్డారు. ఓపెక్ దేశాల ఆయిల్, రాజకీయాలపై చావెజ్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మదురో కృషి చేశారు.
ఇక 2000 సంవత్సరంలో మదురో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2005 లో నేషనల్ అసెంబ్లీకు అధ్యక్షుడిగా అయ్యారు. 2006 లో మదురోను వెనీజులా విదేశాంగ మంత్రిగా చావెజ్ నియమించారు. ఆరు సంవత్సరాల తర్వాత వెనీజులా ఉపాధ్యక్షుడిగా మదురో నియమితులయ్యారు. 2013లో చావెజ్ మరణం తర్వాత మదురో వెనీజులా అధ్యక్షుడిగా అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.
దేశవ్యాప్తంగా మదురోపై నిరసనకారులు ఆందోళన చేపట్టారు. మదురో రాజీనామా చేయాలని డిమాండ్స్ అధికం అయ్యాయి. అయితే మదురో.. తన సైనిక బలాన్ని ఉపయోగించి ప్రజల పోరాటాన్ని అణచివేశారు. ఈ దాడుల్లో 100 మందికిపైగా నిరసనకారులు మృతి చెందారు. 2018 అధ్యక్ష ఎన్నికల్లో మదురో తిరిగి అధ్యక్షుడిగా గెలిచిన తీరు అప్రజాస్వామికం అని అమెరికా అతడ్ని అధ్యక్షుడిగా గుర్తించలేదు. అలా 2019 నుంచి అమెరికాతోపాటుగా 50 దేశాలు మదురోను వెనీజులా అధ్యక్షుడిగా గుర్తించేందుకు ఇష్టపడలేదు.
2019 తర్వాత మదురో ఆగడాలు అధికం అయ్యాయి. అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో చేతులు కలిపి ఆయన నార్కో టెర్రరిజానికి బీజం వేశారు. అమెరికాతోపాటు ఇతర దేశాల్లో డ్రగ్స్ అక్రమ రవాణా పెద్ద ఎత్తున చేపట్టారు. ఇటీవల నికోలస్ మదురో అమెరికాలో 'నార్కో టెర్రరిజం' (మత్తు పదార్థాల అక్రమ రవాణా) చేస్తున్నారని ట్రంప్ సర్కార్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అమెరికా తాజాగా వెనీజులాపై దాడులకు పాల్పడింది. అంతేకాక అనేక డ్రగ్ ముఠాలకు మదురో నాయకుడిగా ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే వెనీజులాపై దాడికి అమెరికా చాలాకాలం నుంచి యత్నిస్తోంది. మరోవైపు ప్రపంచంలోనే వెనీజులాలో అత్యధిక చమురు నిల్వలు ఉన్నాయి. వీటిని దక్కించుకునేందుకూ ట్రంప్ సర్కార్ యత్నిస్తోంది. అలాగే వెనీజులా ప్రతిపక్షనేత మచాడోకు ట్రంప్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వెనీజులాపై ట్రంప్ సర్కార్ దాడులకు పాల్పడింది. మదురో అతని సతీమణి సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది అమెరికా సైన్యం.












Click it and Unblock the Notifications