Nepal Flash Floods: వరదలకు నేపాల్ విలవిల..! 105 మంది భారతీయుల గల్లంతు..!
హిమాలయ దేశం నేపాల్ ను అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వరదలు (Nepal Flash Floods) కుదిపేశాయి. టిబెట్ నుంచి అకస్మాత్తుగా వచ్చిన వరద ధాటికి నేపాల్ లో నదులు పొంగిపొర్లాయి, వంతెనలు కొట్టుకుపోయాయి. కళ్లు తెరిచి చూసే లూపే వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో ఎంత మంది బతికి ఉన్నారు, ఇంకెంతమంది చనిపోయారో వివరాలు కూడా తెలియని పరిస్ధితి నెలకొంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు 8 మంది చనిపోయారు. 348 మంది గల్లంతయ్యారు. ఇందులో 105 మంది భారతీయులే ఉన్నారు.
నేపాల్ లోని భోటే కోషి నదిలో వచ్చిన ఆకస్మిక వరద నువాకోట్, ధాడింగ్ జిల్లాలను ముంచెత్తడంతో కనీసం ఎనిమిది మంది మరణించారు. అలాగే 105 మంది భారతీయులతో సహా పలువురు గల్లంతయ్యారు. నేపాల్ మీడియా నివేదికల ప్రకారం ఈ వరద నీరు సరిహద్దుకు టిబెట్ వైపు నుండి వచ్చి, నేపాల్‌లో విస్తృత నష్టాన్ని కలిగించి అనేక గ్రామాలను ముంచెత్తింది. ఇప్పటివరకు కనీసం ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం వరద ప్రభావిత ప్రాంతం నుండి 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ జాతీయులతో సహా కనీసం 384 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. విదేశీయులలో 105 మంది భారత జాతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు.

రసువా జిల్లాలో కనీసం 26 మంది నేపాల్ పోలీసు సిబ్బంది ఇప్పటికీ గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సాయుధ పోలీసు దళానికి చెందిన ఏడుగురు సిబ్బంది కూడా గల్లంతయ్యారు. వరద ప్రాంతాలకు నేపాల్ సైన్యం హెలికాప్టర్లను, విపత్తు సహాయక సిబ్బందిని పంపింది. ఈ వరదల ధాటికి రోడ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అధికారులు విధ్వంసం తీవ్రతను అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు. వరదల్లో కనీసం ఆరు ప్రధాన జలవిద్యుత్, ప్రసార కేంద్రాలు దెబ్బతిన్నాయని నేపాల్ విద్యుత్ అథారిటీ తెలిపింది.

వరదల కారణంగా నేపాల్ లో పలు జాతీయ రహదారుల్ని సైతం మూసేశారు. నేపాల్ పోలీసులు, స్థానికులు సోషల్ మీడియాలో వరద వీడియోల్ని షేర్ చేస్తున్నారు. వీటిలో టిబెట్ సరిహద్దు జిల్లాల్లోని హిమాలయ దేశంలో పర్వత లోయల గుండా బురద నీటి ప్రవాహాలు విరుచుకుపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నది ఒడ్డున నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని బాలేంద్ర షా జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు , నిర్వహణ అథారిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.














Click it and Unblock the Notifications