వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా?
వాట్సాప్ ప్రాచుర్యం లేని రోజుల్లో చాలా మంది సాధారణ ఎస్‌ఎంఎస్‌ల ద్వారానే సందేశాలను పంపించుకునేవారు. అనవసరమైవి, మోసపూరితమైనవి ఎక్కువవడంతో వాటికి స్వస్తి పలికారు. వాట్సాప్ (WhatsApp)లో ఆ బెడద లేకపోవడంతో అందరూ దాన్నే వినియోగిస్తున్నారు. ఇటీవల వాట్సాప్ లోనూ స్కామ్ మెసేజ్‌లు, కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. గత పదిరోజుల్లో ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి తీవ్రస్థాయిలో మెసేజ్‌లు, కాల్స్ వస్తున్నాయి.
ఉద్యోగావకాశాలు, లాటరీలు, లోన్‌ల పేరిట ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి వాట్సాప్ సందేశాలు, కాల్స్ వస్తున్నాయి. మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా సహా పలు ఇతర దేశాలకు చెందిన ఐఎస్‌డీ కోడ్‌లతో మోసగాళ్లు ఈ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇది చాలా పెద్ద స్కామ్ అని, ఎవరూ స్పందించొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

మోసగాళ్ల చేతికి తమ నంబర్లు ఎలా చిక్కాయానే ఆందోళనను యూజర్లు వ్యక్తం చేస్తున్నారు. తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఈ మెసేజ్‌లు, కాల్స్ వెనకున్న అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పటి గుర్తించలేదు. డబ్బును దోచుకోవడం లేదంటే వ్యక్తిగత సమాచారం తస్కరించడమే వారి లక్ష్యమై ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాట్సాప్ VoIP నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది. ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా ప్రపంచంలో ఏ దేశం నుంచైనా కాల్ చేయొచ్చు. మెసేజ్‌లు పంపొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మోసగాళ్లు అంతర్జాతీయ నంబర్ల ద్వారా మోసాలు చేస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి కాల్ లేదా మెసేజ్ వచ్చినంత మాత్రాన అది కచ్చితంగా ఇంటర్నేషనల్ నెంబరే అవ్వాల్సిన అవసరం లేదు.
ఇటీవల కొన్ని ఏజెన్సీలు వాట్సాప్ కాల్, మెసేజ్‌ల కోసం మనముంటున్న సొంత నగరంలోనే ఇంటర్నేషనల్ నెంబర్లను విక్రయిస్తున్నాయి. తెలియని నంబర్ల నుంచి కాల్స్ కానీ మెసేజ్‌లు కానీ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications