కరోనా విలయం:లాక్‌డౌన్ బద్దలుకొట్టి.. ఆయధాలతో ‘ఆపరేషన్ గ్రిడ్ లాక్’
''ఆరోగ్యవంతుల్ని ఇళ్లల్లో బంధించడమేంటి? కరోనా రోగుల్ని గుర్తించి, వాళ్లను కదా ఆస్పత్రుల్లో పెట్టాల్సింది? వైరస్ కంటే బలవంతపు నిర్బంధం చాలా ప్రమాదకరం. లాక్ డౌన్ కారణంగా కొన్ని లక్షల మంది ఉపాధికోల్పోయి రోడ్డున పడతారని ఈ పాలకులకు తెలియదా? తెలిసికూడా జనంతో ఆడుకోదల్చారా? అందుకే గవర్నర్ గ్రెచెన్ విట్మర్ ఆదేశాలను ధిక్కరిస్తున్నాం. నిరంకుశ లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తున్నాం.. '' అంటూ వేలాది మంది మిషిగనీస్.. మిషిన్ గన్స్, రివాల్వర్స్ చేతబట్టుకుని రోడ్లెక్కారు.

అసలేం జరుగుతోంది?
అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పటిలాగే ఎమర్జెన్సీ సమయంలోనూ వ్యతిరేకవాదన బలంగా వినబడుతోంది. పన్ను చెల్లింపుదారులుగా తమకూ హక్కులుంటాయని, ప్రభుత్వాలు చెప్పినదానికల్లా తలూపబోమనే గ్యాంగులు ఇదే అదనుగా రెచ్చిపోతున్నాయి. లాక్ డౌన్ విషయంలో ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య కీచులాట నడుస్తుండటం, ట్రంప్ పై కొందరు గవర్నర్లు తిరుగుబావుటా ఎగరేయటం లాంటి పరిణామాలతో వ్యతిరేకవాదుల ఉత్సాహం రెట్టింపైంది. ప్రధానంగా, కన్జర్వేటివ్ లు ఈ ప్రయత్నంలో ముందున్నారు. మిషిగన్ రాష్ట్రంలో ఆ వర్గీయులు చేసిన పని పెనుదుమారం రేపుతున్నది.

ఆపరేషన్ గ్రిడ్ లాక్..
అమెరికాలో గురువారం నాటికి 6.45లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. అందులో సుమారు 49వేల మంది కోలుకోగా, ఏకంగా 29వేల మంది చనిపోయారు. మరో 13వేల మంది కండిషన్ క్రిటికల్ గా ఉంది. అత్యధిక మరణాలు(14వేల) చోటుచేసుకున్న న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీ, మసాచుసెట్స్, మిషిగన్, కాలిఫోర్నియా రాష్ట్రాలు మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉన్నాయి. డెమోక్రటిక్ లేడీ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ ఏలుబడిలోని మిషిగన్ లో ఈనెల 30 వరకు లాక్ డౌన్ పొడగించారు. అక్కడి కన్జర్వేటివ్ వర్గీయులు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మిషిగన్ రాష్ట్ర రాజధాని లాన్సింగ్ లో ‘ఆపరేషన్ గ్రిడ్ లాక్' పేరుతో రోడ్లను దిగ్బంధించారు. నిరసనకారులంతా మిషిన్ గన్స్, రైఫిల్స్, రివాల్వర్స్.. ఇలా మారణాయుధాలు చేతపట్టి నడివీధుల్లో వీరంగం సృష్టించారు.

ఇంత దుర్మార్గమా?
లాక్ డౌన్ ఆదేశాలు ధిక్కరించి రోడ్లపైకొచ్చిన వ్యక్తులపై మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నిరసన పేరుతో ఎంతటి ప్రమాదాన్ని సృష్టిస్తున్నారో వాళ్లకు అర్థం అర్థంకావట్లేదు. ఒట్టి చేతులతో చిన్నపిల్లలకు స్వీట్స్ పంచుతూ దుర్మార్గంగా వ్యవహరించారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఎన్ని ఇంబదులకు గురవుతారో తెలియకేంకాదు, కానీ కరోనా కట్టడికి ఇంతకు మించిన మార్గం లేనేలేదు. పక్కవాళ్ల ప్రాణాలను ప్రమాదంలో పడేసే ఇలాంటి ఆందోళనలు వద్దు''అని అన్నారామె.

ట్రంప్‌కు వ్యతిరేకంగా..
కరోనా కారణంగా మూతపడ్డ వ్యవస్థలను రీఓపెనింగ్ చేసే విషయంలో రాష్ట్రాలన్నీ తన మాటే వినాలని ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశించడం, దాన్ని పలువురు గవర్నర్లు తిరస్కరించడం తెలిసిందే. ట్రంప్ తీరును నిరసిస్తూ, ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గవర్నర్లు జట్టుకట్టారు. వాళ్లలో మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ తో ఆమె గొడవపడుతుంటే.. సొంత రాష్ట్రంలో ఆమెకు వ్యతిరేకంగా కన్జర్వేటివ్ లు నిరసనలకు దిగుతున్నారు.












Click it and Unblock the Notifications