ఫేస్‌బుక్‌కు షాకిచ్చిన ప్లేబాయ్ మేగజైన్: ఫేస్‌బుక్ పేజీ డిలీట్
న్యూయార్క్: ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకైందని వెలుగులోకి రావడంతో ప్రముఖ ప్లేబాయ్ మేగజైన్ ఫేస్‌బుక్ పేజీని డీయాక్టివేట్ చేసింది. ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం లీక్ చేసి రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే కథనాలు దుమారం రేగింది.
ఇప్పటికే టెల్సా, స్పెస్‌ఎక్స్ సంస్థలు తమ అధికారిక పేజీలను ఫేస్‌బుక్ నుండి తొలగించాయి. వాటి తర్వాతి స్థానంలో ప్లేబాయ్ మేగజైన్ నిలిచింది. ప్లేబాయ్ మేగజైన్ వ్యవస్థాపకుడి తనయుడు చీప్ క్రియేటివ్ అధికారి కూపర్ హెఫ్నర్ తాజాగా తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీని తొలగించినట్టుగా ట్వీట్ చేశారు.
ఫేస్‌బుక్ సమాచార మార్గదర్శకాలు, కార్పోరేట్ పాలసీలు, ప్లేబాయ్ విలువలకు విరుద్దంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. లైంగిక సమాచార అణచివేత వేదికగా ఫేస్‌బుక్ మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 5 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం లీకైందన్న వార్తల నేపథ్యంలో తమ పేజీని తొలగించాలని నిర్ణయించినట్టు ఆయన ప్రకటించారు. సుమారు 25 లక్షల మంది వినియోగదారులు ఫేస్‌బుక్‌లోని వివిధ ప్లేబాయ్ పేజీలను వీక్షిస్తారని ఆయన చెప్పారు. అయితే వీరి సమాచారం బయటపెట్టడం తమకు ఇష్టం లేని కారణంగానే తాము ఈ పేజీని తొలగించినట్టు చెప్పారు.
ప్లేబాయ్ వ్యక్తిగత స్వేచ్చ, శృంగార ఆస్వాదనను గౌరవిస్తోందని చెప్పారు. వినియోగదారుల సమాచారాన్ని బయటపెట్టేదిగా ఫేస్ బుక్ చర్యలు ఉన్నాయని ఆయన అబిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications