నేపాల్ ప్రధానికి ప్రధాని మోదీ ఫోన్.. అన్ని రకాల సాయం అందిస్తామని హామీ..
భారత్ కు పొరుగు దేశమైన నేపాల్ లో ఆకస్మిక వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు వెంబడి ఉన్న రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాల గుండా ప్రవహించే భోటే కోశీ నదిలో వరద ఉప్పొంగింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా భారతీయులతో సహా వందలాది మంది పర్యాటకులు గల్లంతయ్యారు. అలాగే అనేక గ్రామాలు, రహదారులు, జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం అయ్యాయి.
వరదల్లో చిక్కుకుని దాదాపు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బాధితుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు నేపాల్ సైన్యం హెలికాప్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇక ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్ కు అండగా నిలుస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. నేపాల్ లో ఆకస్మికంగా సంభవించిన ఈ విషాద ఘటనపై ప్రజలకు మోదీ సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ కష్టకాలంలో నేపాల్ కు అవసరమైన మానవతా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో వేదికగా ప్రకటించారు.
అలాగే నేపాల్ అధికారులతో భారతీయ బృందాలు సమన్వయం చేస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా తగిన సాయం అందించేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. అత్యవసర చికిత్సకు అవసరమయ్యే మందులు, రేషన్, ఇతర సరుకులు అందించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు నేపాల్ లో గల్లంతైన భారతీయులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు నేపాల్ లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రత్యేక ఎమర్జెన్సీ నెంబర్లను ప్రకటించింది. +977 985 131 6807, +977 970 910 7500 నెంబర్లను వాట్సాప్ మాధ్యమం ద్వారా సంప్రదించాలని సూచనలు చేసింది.

ఇక తాజాగా నేపాల్ టూరిజం బోర్డు రిలీజ్ చేసిన నివేదికల ప్రకారం చూస్తే.. ఆకస్మికంగా సంభవించిన ఈ వరదల్లో మొత్తం 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. అయితే వీరిలో 105 మంది భారతీయులు, 93 మంది నేపాల్ పౌరులు, మిగిలిన వారు విదేశీయులు ఉన్నారు. అలాగే 44 మంది నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 80 మంది భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ వెంటనే రంగంలోకి దిగింది. హెలికాప్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలను తరలించింది. ఈ మేరకు ఘటనా ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications