మోదీ నా ఆప్తమిత్రుడు: రెండో ప్రపంచ యుద్ధం నాటి అనుబంధం
అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యత, ఆర్థిక శక్తి శరవేగంగా పెరుగుతుందనడానికి నిదర్శనంగా న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఉన్నత స్థాయి దౌత్య చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలాండ్ ప్రధాని.. ప్రధాని నరేంద్ర మోదీని తన ఆప్తమిత్రుడిగా అభివర్ణించుకోవడానికి ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తీవ్ర అస్థిరత, అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్ ప్రపంచ దేశాలకు ఒక నమ్మకమైన "ఆశారేఖ" అని కొనియాడారు.
భారత్ , పోలాండ్ దేశాల మధ్య ఎలాంటి స్వార్థ ప్రయోజనాల ఘర్షణ గానీ, విడదీసే చారిత్రక వివాదాలు గానీ లేవని డోనాల్డ్ టస్క్ స్పష్టం చేశారు. కేవలం భౌగోళిక దూరమే తప్ప తమ రెండు దేశాలను ఏదీ వేరుచేయలేదని, అహింస, పరస్పర నమ్మకం అనే బలమైన పునాదులపై ఈ స్నేహం కొనసాగుతోందని పేర్కొన్నారు. గతంలో 2024లో ప్రధాని మోదీ పోలాండ్ పర్యటనకు వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఏర్పడిందని, గడిచిన రెండేళ్లలో ఈ బంధం మరింత వేగంగా ముందుకు సాగిందని ఇద్దరు నేతలు వివరించారు.

రెండో ప్రపంచ యుద్ధం నాటి చారిత్రక అనుబంధం
ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్-పోలాండ్ స్నేహం కేవలం దౌత్యపరమైన సంబంధాలకు మాత్రమే పరిమితం కాదని, మానవత్వం, సానుభూతితో కూడిన గొప్ప చారిత్రక వారసత్వమని గుర్తుచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో జామ్‌నగర్, కొల్హాపూర్ సంస్థానాల రాజకుటుంబాలు వేలాది మంది పోలిష్ శరణార్థులకు, చిన్నారులకు ఆశ్రయమిచ్చి ఆదుకున్న తీరును మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదురుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వల్ల ఇరు దేశాల మధ్య వ్యాపార అవకాశాలు మరింత విస్తరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వాణిజ్యం, రక్షణ, అంతరిక్ష రంగాల్లో భాగస్వామ్యం
పోలాండ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతినిధుల బృందాల్లోనే ఇది అత్యంత పెద్దదని, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని టస్క్ తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 6 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యాన్ని 10 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ఇరుదేశాల వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రక్షణ రంగం, డ్రోన్ టెక్నాలజీ, మైనింగ్, షిప్‌బిల్డింగ్, డిజిటలైజేషన్ , స్పేస్ టెక్నాలజీ విభాగాల్లో పోలాండ్-భారత్ కలసి పనిచేయనున్నాయి. 2010 తర్వాత ఒక పోలాండ్ ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఢిల్లీ నుంచి బెంగళూరు వైపు అడుగులు
ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన పోలాండ్ ప్రధాని, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కూడా ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఢిల్లీలోని బిజినెస్ ఫోరమ్ ముగిసిన అనంతరం, టస్క్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అక్టోబర్ 23న బెంగళూరుకు వెళ్లనుంది. అక్కడ భారత ఐటీ రంగానికి చెందిన ప్రముఖులు , ఇస్రో, అంతరిక్ష రంగానికి చెందిన నిపుణులతో వారు కీలక భేటీలు కానున్నారు.














Click it and Unblock the Notifications
