పుతిన్, ట్రంప్‌ల కీలక సమావేశం రద్దు: కారణం ఇదే!
Donald Trump: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య హంగరీలో జరగాల్సిన అత్యంత కీలక సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశంలో ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దానిని నిలిపివేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగాల్సి ఉంది.
ఫోన్ సంభాషణ తర్వాత నిర్ణయం
కొద్ది రోజుల క్రితం పుతిన్, ట్రంప్‌ల మధ్య సుమారు రెండు గంటల పాటు ఫోన్లో సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ఇద్దరు నాయకులు ఉక్రెయిన్ యుద్ధం గురించి, దానిని నిలిపివేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పుతిన్, ఉక్రెయిన్‌కు టామహాక్ క్షిపణులను ఇవ్వవద్దని ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో సమావేశం కావాలని ఇద్దరూ అంగీకరించారు.

ట్రంప్ చెప్పిన కారణం ఇదే:
అయితే ఈ సమావేశం వాయిదా పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవార ప్రకటించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. "ఒక నిష్ప్రయోజనమైన సమావేశాన్ని నేను కోరుకోలేదు, అందుకే పుతిన్‌తో జరగాల్సిన మీటింగ్‌ను వాయిదా వేశాను." అని ట్రంప్ తెలిపారు.
పుతిన్-ట్రంప్‌ల మధ్య చర్చలు వాయిదా పడటానికి ఉక్రెయిన్ అంశంలో వారి మధ్య ఉన్న తీవ్ర విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించడానికి పుతిన్ సిద్ధంగా లేరు. ఉక్రెయిన్ డొన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ కూడా గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయినప్పుడు డొన్బాస్‌ను వదులుకోవాలని ఒత్తిడి చేశారు. కానీ జెలెన్స్కీ దీనికి ససేమిరా అన్నారు.
పుతిన్ కాల్పుల విరమణకు సిద్ధంగా లేకపోవడం, డొన్బాస్ అంశంలో ఇద్దరు నాయకులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం వల్లనే ఈ సమావేశం నిష్ప్రయోజనంగా మారుతుందని భావించి, ట్రంప్ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం మళ్లీ ఎప్పుడు జరుగుతుందనే దానిపై రష్యా, అమెరికా అధికారులు ఎలాంటి కొత్త తేదీని ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications