నేడు అరుదైన సూర్య గ్రహణం: పాటించాల్సిన జాగ్రత్తలు
వాషింగ్టన్: నేడు సూర్యగ్రహణం (Solar eclipse) ఏర్పడబోతోంది. ఇది పాక్షికం. అత్యంత అరుదైన గ్రహణం ఇది. మహాలయ పితృపక్ష అమావాస్యతో కలిసి రావడం దీని ప్రత్యేకత. ఇదివరకు ఇలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. అదే సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of fire) కనువిందు చేయనుంది.
ఈ సూర్య గ్రహణం భారత్‌లో కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆయా దేశాల ప్రజలు మాత్రమే పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అమెరికా, కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, హోండురస్, పనామా దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడగలరు.

ఈ సూర్యగ్రహణాన్ని అమెరికన్లందరూ తిలకించే అవకాశం లేదు. నార్త్ కాలిఫోర్నియా, నార్త్ ఈస్ట్ నెవడా, సెంట్రల్ ఉటా, నార్త్ ఈస్ట్ అరిజోనా, సౌత్ వెస్ట్ కొలరాడో, సెంట్రల్ న్యూ మెక్సికో, సదరన్ టెక్సాస్ ప్రజలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్‌ను ఎంజాయ్ చేయగలరు. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది.
భారత కాలమానం ప్రకారం- ఈ రాత్రి 9 గంటలకు సూర్యగ్రహణ కాలం ఆరంభమౌతుంది. అర్ధరాత్రి దాటిన తరువాత అంటే మరుసటి రోజు తెల్లవారు జామున 1:45 నిమిషాలకు గరిష్ఠస్థాయికి చేరుకుంటుంది. 1:06 నుంచి 2:23 నిమిషాల వరకు సూర్యుడు పాక్షికంగా చీకట్లో ఉంటాడు.
సూర్యుడు- చంద్రుడు- భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంటుంది. సూర్యుడు-భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. ఈ సారి ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్ 5:17 సెకెండ్ల పాటు కనువిందు చేస్తుంది.
సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నేరుగా సూర్యుడిని చూడటం వల్ల కంటిచూపుపై ప్రభావం పడుతుంది. సూర్యుడిని చూడటానికి సరైన ఫిల్టర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం బ్లాక్ కలర్ ఫిల్మ్స్ వాడొచ్చు. ఈ సూర్యగ్రహణాన్ని నాసా లైవ్‌లో చిత్రీకరించనుంది. తన అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.












Click it and Unblock the Notifications