ఎవడి బండారం బయటపడుతుందో గానీ..!!
అమెరికాలో సంచలనం రేపుతున్న జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఫైల్స్ కేసును బహిరంగపర్చడానికి ఉద్దేశించిన బిల్లును అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏ ఒక్క సెనెటర్ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని తీవ్రత ఏమిటో చాటిచెప్పింది. అంతకుముందు- హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈ బిల్లును ఆమోదించింది. తుది ఆమోదం కోసం వైట్ హౌస్ రానుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం అనంతరం చట్టంగా మారుతుంది.
అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం సెనెట్ ఈ బైపార్టీసన్ బిల్లును ఆమోదించింది. దీంతో ఈ బిల్లుకు సంబంధించి సెనేట్‌లో ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదు. నేరుగా అధ్యక్షుడి వద్దకు వెళ్ళిన తర్వాత అది చట్టంగా మారుతుంది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన అన్ని కేసు ఫైల్‌లను విడుదల చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌ను కోరుతూ తొలుత ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సమక్షానికి వచ్చింది.

దీనిపై నిర్వహించిన ఓటింగ్ లో 438 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. 427 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఒక్క ఓటు మాత్రమే పడింది. రిపబ్లికన్ ప్రతినిధి క్లే హిగ్గిన్స్ మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అనంతరం సెనెట్ ముందుకు వచ్చింది. రిపబ్లికన్ ప్రతినిధులు థామస్ మాస్సీ, మార్జోరీ టేలర్ గ్రీన్, రో ఖన్నా దీన్ని సెనెట్ లో ప్రవేశపెట్టారు. దీనికి మద్దతు ఇవ్వాలని తోటి సభ్యులను కోరారు.
అక్కడ ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఏ ఒక్క సెనెటర్ గానీ దీన్ని వ్యతిరేకించలేదు. దీంతో రిపబ్లికన్, డెమొక్రాటిక్ చట్టసభ సభ్యుల మద్దతు పొందినట్టయింది. ఇక ఇది చట్టంగా రూపుదాల్చనుంది. డొనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారుతుంది. ఈ వారంలో డొనాల్డ్ ట్రంప్.. దీనిపై సంతకం చేసే అవకాశం ఉందని ది ఫాక్స్ న్యూస్ తెలిపింది. ఈ కేసు వివరాలు పూర్తిగా బయటికి వస్తే పలువురు ప్రముఖల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్. అతని బారిన పడిన బాధితులకు న్యాయం అందించడం, ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను ప్రజలకు తెలియజేయడం, పారదర్శకతను కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. ఎప్ స్టీన్ ఫైల్స్ వివరాలను ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మొదటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చారు. ఈ బిల్లుకు ఇదివరకే సంపూర్ణ మద్దతు తెలిపారు. దీన్ని ఆమోదించాలని యూఎస్ కాంగ్రెస్ ను కోరారు. తన డెస్క్‌కి వస్తే సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications