నిప్పు కణికలా నేలకూలిన ఫ్లైట్
Donald Trump: అమెరికాలో ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రాజధాని వాషింగ్టన్ డీసీలో గల రొనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంపై ఓ ఫ్లైట్.. ఆ దేశ సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను గాల్లోనే ఢీ కొట్టింది.
రొనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో ల్యాండ్ అవుతోన్న హెలికాప్టర్‌ను ఢీ కొట్టిందీ పాసింజర్ ఫ్లైట్. ఢీ కొట్టిన వెంటనే రెండూ గాల్లోనే ముక్కలయ్యాయి. పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయాయి. నిప్పులు చిమ్ముతూ కుప్పకూలిపోయాయి.

విమానం, హెలికాప్టర్ శకలాలు ఎక్కడికక్కడ ఎగిరిపడ్డాయి. పొటొమాక్ రివర్‌లో చెల్లాచెదురుగా పడ్డాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నాటి ఘటనలో 30 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఆ దిగ్భ్రాంతికర ఘటన నుంచి తేరుకోక ముందే మరో విమాన ప్రమాదం చోటు చేసుకుందక్కడ. ఫిలడెల్ఫియాలో ఓ జెట్ ఫ్లైట్ కుప్పకూలింది.
ఈ దుర్ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. లియర్‌జెట్ 55కు చెందిన మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ విమానం అది. నార్త్ ఈస్ట్ ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకెండ్లల్లోనే ప్రమాదానికి గురైంది. అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కుప్పకూలింది.
ఫిలడెల్ఫియా రాన్ హర్ట్స్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న రూజ్‌వెల్ట్ షాపింగ్ మాల్, ఇతర జనావాసాలపై ఈ జెట్ శకలాలు పడ్డాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ఫ్లైట్ మొత్త దగ్ధమైంది. మంటలు జనావాసాలకూ వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టింది.
ఇప్పుడు మళ్లీ అలాంటి ఉదంతమే సంభవించింది. శాన్ డియాగోలో ఓ ప్రైవేట్ తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. టియెర్రాశాంటా ఏరియాలో జనావాసాల మీద కుప్పకూలింది. ఈ ఘటనలో ఆ విమానంలో ఉన్న వాళ్లందరూ మరణించినట్లు శాన్ డియాగో ఫైర్ సర్వీస్ వెల్లడించింది.
అమెరికా కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 3: 45 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. మోంట్ గోమే- గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న సెస్నా 550 రకానికి ఫ్లైట్.. మర్ఫీ కెన్యాన్ ఏరియా గగనతలంపై ప్రమాదానికి గురైంది. జనావాసాలపై కుప్పకూలింది.
దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు శాన్ డియాగో పోలీస్ అండ్ ఫైర్ సర్వీస్ వెల్లడించింది. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న సమయంలో ఈ ఫ్లైట్ లో 6 నుంచి 8 మంది ఉన్నట్లు చెబుతున్నారు. వారందరూ కూడా మరణించి ఉండొచ్చని భావిస్తోన్నారు.
విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఫలితంగా కొన్ని నివాసాలు ధ్వంసం అయ్యాయి. పార్క్ చేసి ఉంచిన కార్లు మంటల బారిన పడ్డాయి. ఈ ఘటనలో 10కి పైగా నివాసాలు దగ్ధమైనట్లు శాన్ డియాగో పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఆయా నివాసాలను ఖాళీ చేయించామని వివరించారు.












Click it and Unblock the Notifications