No shah.. అమెరికాకు పాకిన ఇరాన్ అల్లర్లు- లాస్ ఏంజిలిస్ లో జనంపై దూసుకెళ్లిన భారీ ట్రక్
ఇరాన్‌లో దేశవ్యాప్త నిరసనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. హింసాత్మకంగా మారుతున్నాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రధాన నగరాలకు ఈ ఆందోళనలు విస్తరించాయి. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ నివేదిక ప్రకారం- ఇప్పటివరకు కనీసం 538 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తుల విధ్వంసం కొనసాగుతోంది. 10,670 మంది ఆందోళనకారులను అక్కడి సైన్యం అదుపులోకి తీసుకుంది.
నిరసనకారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడంతో క్షేత్రస్థాయిని అంచనా వేయడం కష్టంగా మారింది. సమాచార బ్లాక్ అవుట్‌తో దేశం లోపల, వెలుపల ప్రజల మధ్య సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. అక్కడ ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఇరాన్ సంక్షోభ ప్రభావం దేశ సరిహద్దులు దాటి విస్తరిస్తోంది. అమెరికాకూ పాకాయి ఈ అల్లర్లు. ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీకి వ్యతిరేకంగా లాస్ ఏంజిలిస్ లో ఓ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వేలాదిమంది గుమికూడిన ఈ ర్యాలీపై ఓ యూ హాల్ ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇరాన్ నిరసనలకు మద్దతుగా వేలాది మంది లాస్ ఏంజిలిస్ లోని వెస్ట్‌వుడ్ విల్ షైర్ ఫెడరల్ భవనం బయట గుమిగూడారు. నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూ హాల్ ట్రక్ వారిపైకి దూసుకెళ్లింది. అనూహ్యంగా సంభవించిన ఈ ఘటనతో ప్రదర్శనకారులు ఉలిక్కిపడ్డారు. పరుగులు తీశారు. హాహాకారాలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే లాస్ ఏంజిలిస్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
BREAKING: Truck drives into crowd in Los Angeles, California pic.twitter.com/tVnUlfbyxx
— Rapid Report (@RapidReport2025) January 11, 2026
ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ట్రక్‌పై ఇరాన్ గతాన్ని సూచించే రాజకీయ సందేశాలు రాసివున్నాయి. "No shah, no regime. USA: Don't repeat 1953, no mullah" అనే నినాదం ఈ ట్రక్ పై కనిపించింది. ఇది 1953లో అమెరికా మద్దతుతో జరిగిన తిరుగుబాటు, ఇరాన్ ప్రధానమంత్రిని తొలగించి షాను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన స్లోగన్ ఇది.
పోలీసులు ట్రక్ డ్రైవర్‌ను తరలిస్తున్న సమయంలో కొంతమంది నిరసనకారులు జెండా కర్రలతో అతనిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ట్రక్ విండ్‌షీల్డ్ పగిలి, గాజు పెంకులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఖాళీ ట్రైలర్ వెనుక తలుపు తెరిచి ఉండటంతో ఇంకొంతమంది ఉండొచ్చని అనుమానించారు. డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అనేది స్పష్టం కాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications