Nuke India: భారత్ తో టారిఫ్ గొడవల వేళ- ట్రంప్ కు గన్ మెసేజ్
అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పేట్రేగింది. విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించాడో యువకుడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. 25 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మిన్నియాపాలిస్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. స్థానిక చర్చిలో ప్రార్థనలకు హాజరైన పాఠశాల విద్యార్థులపై దుండగుడు కాల్పులు జరిపాడు. షూటర్ తన తుపాకులపై Kill Donald Trump, Nuke India అని రాసివున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పలకు పాల్పడటానికి ముందు తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లోని ఓ వీడియోను అతను పోస్ట్ చేశాడు.

నిందితుడిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించారు. ఈ కాల్పుల కోసం అతను మూడు ఆయుధాలు- రైఫిల్, షాట్‌గన్, పిస్టల్‌ను ఉపయోగించాడు. అనన్సియేషన్ క్యాథలిక్ స్కూల్‌లోని చర్చిపై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం పార్కింగ్ స్థలంలో రక్తపుమడుగులో కనిపించాడు. తనకు తానే కాల్చుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనకు పాల్పడటానికి ముందు రాబిన్ డబ్ల్యూ పేరుతో ఉన్న తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో రెండు వీడియోలను అతను పోస్ట్ చేశాడు. దాదాపు 10 నిమిషాల నిడివి గల ఒక వీడియోను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. అందులో- ఆయుధాలు, పేలుడు సామగ్రి, లోడ్ చేసిన కొన్ని గన్ మ్యాగజైన్లు కనిపించాయి.
వాటిపై Kill Donald Trump, kill Trump now, Israel must fall, Burn Israel, అనే అక్షరాలను రాసి ఉన్నట్లు గుర్తించారు. మరో గన్ పై Nuke India రాసి వుండటం కనిపించింది. గతంలో జరిగిన పాఠశాల కాల్పుల నిందితుల పేర్లు కూడా ఓ మ్యాగజైన్‌పై ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. కొన్ని సందేశాలు సిరిలిక్ లిపిలో ఉన్నట్లు వివరించారు.
తాను ట్రాన్స్‌జెండర్‌నని రాబిన్ వెస్ట్‌మన్ చెప్పుకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. చట్టబద్ధంగా ఆయుధాలను కొనుగోలు చేశాడని, గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరి ప్రమేయం లేదని, ఒంటరిగానే ఈ కాల్పులకు పాల్పడినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications