సూపర్ హెవీ స్పేస్ షిప్: మార్స్‌పై మనుషులు..!!
వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ రీసెర్చ్ కంపెనీ ఇది. తాజాగా సూపర్ హెవీ స్పేస్ షిప్‌ను తయరు చేసింది. అంతరిక్షంలోకి భారీ పేలోడ్స్‌ను తీసుకెళ్లడంతో పాటు కుజగ్రహంపైకి మనుషులను కూడా పంపించడానికి వీలుగా దీన్ని సన్నద్ధం చేసిందా సంస్థ. అంతరిక్ష పరిశోధనలను ఈ స్పేస్ షిప్ మలుపు తిప్పగలదని భావిస్తోన్నారు.
ఈ అంతరిక్ష నౌకను విజయవంతంగా పరీక్షించినట్లు స్పేస్ ఎక్స్ తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోస్ట్ చేసింది. భారత కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం 5:30 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోందీ సూపర్ హెవీ అంతరిక్ష నౌక. టెక్సాస్‌లోని లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించనున్నట్లు స్పేస్ ఎక్స్ యాజమాన్యం తెలియజేసింది.

ఫాల్కన్ 9 రాకెట్ల తయారీకి ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే ఈ స్టార్ షిప్ సూపర్ హెవీ నిర్మాణానికీ వినియోగించారు. ఎన్నిసార్లయినా దీన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడానికి వీలుగా తీర్చిదిద్దారు. హెవీ పేలోడ్స్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టాలనేది దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా- చంద్రుడితో పాటు ఇతర గ్రహాలపైకి మనుషులను సైతం చేరవేసేలా ఈ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసినట్లు స్పేస్ ఎక్స్ వెల్లడించింది.
ఈ స్పేస్ షిప్ తొలిదశ బూస్టర్‌లో 33 రాప్టార్ ఇంజిన్లను అమర్చారు. వాటిని మండించడానికి లిక్విడ్ మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్‌ను వినియోగిస్తారు. 160 టన్నుల బరువు ఉన్న కార్గోను అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. ఫాల్కన్-9 మెర్లిన్ ఇంజిన్‌తో పోల్చుకుంటే దీని ఇంజిన్ సామర్థ్యం రెండింతలు అధికం. రెండో దశలో ఆరు ఇంజిన్లు, మూడు రాప్టార్ ఇంజిన్లు, మరో మూడు రాప్టార్ వాక్యుమ్ ఇంజిన్స్ ఉంటాయి.
ఈ రాకెట్ పొడవు 120 మీటర్లు. 150 మెట్రిక్ టన్నుల రీ-యూజబుల్ పేలోడ్, 250 మెట్రిక్ టన్నుల సింగిల్ యూజబుల్ కార్గోను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. ఈ సాయంత్రం జరిగే తొలి పరీక్షపై స్పేస్ ఎక్స్ యాజమాన్యం దృష్టి సారించింది. రాకెట్ లిఫ్ట్ ఆఫ్, బూస్టర్ వేరుపడటం, మళ్లీ అది భూమికి చేరుకోవడంపైనే దీని భవిష్యత్తు ఆధారపడి ఉందని వివరించింది. అంతరిక్షంలోకి ప్రయోగించిన తరువాత హవాయిలోని గ్రౌండ్ స్టేషన్ నుంచి దీన్ని దిశను పర్యవేక్షిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications