వారెవా.. ఈ భవనాల నీడ.. చూద్దామన్నా కనబడదు
న్యూయార్క్ లో త్వరలో నిర్మించబోయే ఓ భవనం నీడ అసలు కనిపించదట. సూర్యుడు ఏటవాలుగా ఉన్నా, నడి నెత్తికి వచ్చినా ఈ భవనం నీడ మీకు చూద్దామన్నా కనిపించదు
న్యూయార్క్: నిర్మాణ రంగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. హరిత భవనాలే ఇలలో అద్భుతం అనుకుంటుంటే.. ఇప్పుడు ఒకడుగు ముందుకేసి నీడ కూడా కనబడని భవనాలను ఇంజనీర్లు అలవోకగా నిర్మిస్తున్నారు.
అవును, మీరు చదివింది నిజమే.. న్యూయార్క్ లో త్వరలో నిర్మించబోయే ఓ భవనం నీడ అసలు కనిపించదట. సూర్యుడు ఏటవాలుగా ఉన్నా, నడి నెత్తికి వచ్చినా ఈ భవనం నీడ మీకు చూద్దామన్నా కనిపించదు.. మరి ఇది అద్భుతమే కదా!

మన్ హట్టన్ లో...
న్యూయార్క్ మహా నగరంలోని మన్ హట్టన్ మీట్ ప్యాకింగ్ డిస్ట్రిక్ట్ వద్ద ‘సోలార్ కార్వ్ టవర్'పేరిట ఓ ఆకాశహార్మ్యాన్ని నిర్మించబోతున్నారు. మొత్తం 1.66 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ భవనాన్ని ‘స్టూడియో గ్యాంగ్' అనే సంస్థ నిర్మించనుంది.

పూర్తి పారదర్శకంగా...
దాదాపు 213 అడుగుల ఎత్తున కట్టే ఈ భవనం పూర్తిగా పారదర్శకమైన అద్దాలతో ఉంటుంది. భవనం ప్రత్యేక డిజైన్ కారణంగా చుట్టు పక్కల భవనాల్లో నివసించే వారికి చక్కని వెలుతురు, ధారాళమైన గాలితో పాటు పరిసరాల తాలూకు ‘వ్యూ' కూడా ఏమాత్రం చెడిపోదు.

నాలుగోసారి ఒప్పుకున్నారు...
సాధారణంగా నగరాల్లో భవనాల ఎత్తు పెరిగే కొద్దీ చుట్టుపక్కల భవనాల వారికి గాలి వెలుతురు తగ్గిపోతాయన్నది తెలిసిందే. అందుకే ఈ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా న్యూయార్క్ లో చాలా ఆందోళనలు జరిగాయి. దీంతో అక్కడి అధికారులు మూడుసార్లు ఈ భవన నిర్మాణానికి అనుమతి తిరస్కరించారు. చివరికి నాలుగోసారి ఓకే చెప్పారు.

భవనం పైభాగంలో గార్డెన్ కూడా...
సోలార్ కార్వ్ టవర్ నిర్మాణంలో రీసైకిల్డ్ మెటీరియన్ అధికంగా వాడుతారు. నీటిని సమర్థంగా వాడుకోవడం, వాన నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం వంటి అదనపు ఫీచర్లు ఈ భవనం ప్రత్యేకతలు. అంతేకాకుండా దీని రూఫ్ టాప్ పై ఓ భారీ గార్డెన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

మన దగ్గర వందల ఏళ్ల క్రితమే...
మన దేశంలోని ఒడిశాలో ఉన్న జగన్నాథ ఆలయ కట్టడ నిర్మాణంలోనూ ఇలాంటి చాతుర్యమే కనిపిస్తుంది. ఏడాది పొడవునా.. ఈ దేవాలయ ప్రధాన గోపురం తాలూకు నీడ ఎక్కడా కనిపించదు. వందల ఏళ్ల క్రితమే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఆలయ ప్రధాన గోపురాన్ని నిర్మించారు.












Click it and Unblock the Notifications