అమెరికాలో థాంక్స్ గివింగ్స్ వీక్: ఈ పండుగ ప్రత్యేకత ఏంటి?
అమెరికాతో పాటు అనేక దేశాల్లో ప్రతి ఏడాది నవంబర్ నాలుగో గురువారం థాంక్స్ గివింగ్ డే జరుపుకుంటారు. ఇది అమెరికాతో పాటు జర్మనీ, బ్రెజిల్, కెనడా, జపాన్, ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటారు. అమెరికాలో ఈ రోజును క్రిస్మస్ లాగా చాలా కోలాహలంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఒకరికొకరు థాంక్స్ తెలుపుకుంటారు. రాబోయే ఏడాది కోసం ప్రార్థిస్తారు. ఈ ఉత్తర అమెరికాలో చేసుకున్న ఓ సాంప్రదాయ పంట పండుగ.
థాంక్స్‌గివింగ్ అంటే ఏమిటి?
థాంక్స్‌గివింగ్ అమెరికాలోని అత్యంత ముఖ్యమైన సెలవు దినాలలో ఒకటి. దీనిని ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున కుటుంబాలు, స్నేహితులు ఒకచోట చేరి పెద్ద విందు (రోస్ట్ చేసిన టర్కీ కోడితో సహా) పంచుకుంటారు. గడిచిన సంవత్సరంలో లభించిన ఆరోగ్యం, పని, కుటుంబం, జీవితానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ సంప్రదాయం 1660వ దశకానికి చెందినది. అప్పట్లో మొట్టమొదటి వలసదారులు అమెరికాలో కఠినమైన, అనిశ్చితితో కూడిన కాలాన్ని గడిపిన తరువాత.. వారికి మంచి పంట లభించిన సందర్భంగా కృతజ్ఞతగా ఒక విందును ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ థాంక్స్ గివింగ్ వారంగా జరుపుకుంటున్నారు.

టర్కీ కోడి ఎందుకు ముఖ్యమైంది?
టర్కీ కోడి థాంక్స్‌గివింగ్ విందులో ప్రధాన ఆహారంగా మారడానికి కొన్ని ఆచరణాత్మక కారణాలు ఉన్నాయి. ప్రారంభంలో అమెరికాలో ఎక్కువగా అడవి టర్కీ కోళ్లు లభించేవి. ఒక పెద్ద టర్కీ కోడి మొత్తం కుటుంబానికి సరిపడే మాంసాన్ని అందించేది. ఇతర మాంసాలతో పోలిస్తే టర్కీ కోడి ధర తక్కువగా ఉండేది. దీనిని సంవత్సరం పొడవునా తరచుగా తినేవారు కాదు, కాబట్టి పండుగ సందర్భంగా తినడం ప్రత్యేకతను సంతరించుకుంది. కాలక్రమేణా టర్కీ కోడి కేవలం భోజనం నుంచి థాంక్స్‌గివింగ్ పండుగకు చిహ్నంగా మారిపోయింది.
అమెరికా అధ్యక్షుడు టర్కీకి క్షమాభిక్ష ఎందుకు ఇస్తారు?
ప్రతి సంవత్సరం అమెరికా అధ్యక్షుడు టర్కీ క్షమాభిక్ష (Turkey Pardon) అని పిలవబడే సరదా సంప్రదాయంలో పాల్గొంటారు. ఒకటి లేదా రెండు టర్కీ కోళ్లను ఎంపిక చేస్తారు. అమెరికా అధ్యక్షుడు ఓ బహిరంగ కార్యక్రమంలో అధికారికంగా వాటికి "క్షమాభిక్ష" ప్రకటిస్తారు. ఈ పక్షులను విందుగా మారకుండా కాపాడి, వాటిని పొలం లేదా పక్షుల సంరక్షణ కేంద్రానికి (Sanctuary) పంపుతారు. అక్కడ అవి తమ జీవితాన్ని గడుపుతాయి. ఈ క్షమాభిక్షకు ఎలాంటి చట్టపరమైన ప్రాముఖ్యత లేదు. ఇది పూర్తిగా సంకేతం మాత్రమే-పండుగ సమయంలో సద్భావన, హాస్యం, దయను ప్రదర్శించే ఒక గుర్తు మాత్రమే.
ట్రంప్ 'వాడిల్', 'గోబుల్'కు క్షమాభిక్ష
సంప్రదాయంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా థాంక్స్‌గివింగ్ సెలవుదినానికి ముందు 'వాడిల్', 'గోబుల్' అనే రెండు టర్కీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. క్షమాభిక్ష కార్యక్రమంలో 'గోబుల్' మాత్రమే రోజ్ గార్డెన్‌లో కనిపించింది. అయితే మొదట బ్రీఫింగ్ రూమ్‌లో కనిపించిన 'వాడిల్' అదృశ్యమవడంపై కొద్దిగా గందరగోళం నెలకొంది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ చమత్కరిస్తూ.. "వాడిల్" ఈ రోజు కనిపించకుండా పోయింది. అందుకే వాడిల్ ఇక్కడే ఉన్నట్లు నటిద్దాం" అని అన్నారు. అంతేకాక డెమొక్రాటిక్ నాయకులైన చక్ షూమర్, నాన్సీ పెలోసి పేర్లను ఆ టర్కీ కోళ్లకు పెట్టాలని తాను ఆలోచించినట్లు కూడా ట్రంప్ హాస్యం చేశారు.












Click it and Unblock the Notifications