రాత్రికి రాత్రి మూడు భూకంపాలు- 2,200 మంది బలి
Afghanistan earthquake 2025: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్.. విపత్తులతో అల్లాడుతోంది. భారీ భూకంపాలతో చివురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే రిక్టర్ స్కేల్ పై 5కు పైగా తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు ఆ దేశాన్ని కకావికలం చేశాయి. ఈ నెల 1వ తేదీన సంభవించిన భూప్రకోపానికి 2,205 మంది బలి అయ్యారు. 3,482 మందికి పైగా గాయపడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ రాత్రికి రాత్రి మూడు వరుస భూకంపాలు సంభవించాయి.
గురువారం రాత్రి నుంచి ఈ తెల్లవారు జాము వరకు వరుసగా మూడు భూకంపాలు నమోదయ్యాయి. తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా రికార్డయింది. అనంతరం రాత్రి 10:22 నిమిషాలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. 34.58 ఉత్తర అక్షాంశం, 70.66 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ ఈశాన్య ప్రాంతం నగర్ హర్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 160 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.

ఈ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్ కు ఈశాన్య దిశగా 21 కిలో మీటర్ల దూరంలో గల ప్రదేశాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. అదే ప్రావిన్స్ లో ఈ తెల్లవారు జామున 3:16 నిమిషాలకు మళ్లీ భూమి ప్రకోపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9గా రికార్డయింది. ఘాజీ అమానుల్లా ఖాన్ టౌన్, గర్డీ ఘాస్ వంటి ప్రదేశాల్లో భూమి కంపించింది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ప్రాంతం కావడం వల్ల అక్కడ కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి.
ఈ రీజియన్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో కొన్ని చోట్ల నివాసాలు బీటలు వారినట్లు సమాచారం అందింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ఆ తర్వాత మళ్లీ 4.3 తీవ్రతతో అదే ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. ఈ నెల 1వ తేదీ నాటి భూకంప సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జంట ప్రకంపనలు ఆ దేశ ప్రజలను నిలువెల్లా వణికించాయి. కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలిక పాటి ప్రకంపనలు చోటు చేసుకుంటోండటంతో ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లే సాహసం చేయలేదు. రోడ్ల మీదే గడిపారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్. తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి ఇక్కడ. హిందూ కుష్ రీజియన్ లో ఎక్కువ సార్లు భూమి ప్రకంపిస్తుంటుంది. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.












Click it and Unblock the Notifications