H1B Visa ఫీజు వ్యవహారంలో ట్రంప్ యూటర్న్ మూడ్?
H-1B వీసా ఫీజు పెంపు వ్యవహారం భారతీయుల కొంప ముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలు కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్క H1B visa మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని రకాల విసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా పరిణమించాయి. ఫీజులు పెంచిన తర్వాత రెండు నెలల కాలంలోనే వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు టెక్ ఆర్గనైజేషన్స్ చెబుతున్నాయి.
సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాల్లోనే కాకుండా అటు స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికాలోనూ దీన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లక్ష డాలర్ల ఫీజును విధించడాన్ని సవాలు చేస్తూ పలు అసోసియేషన్లను కలిసి ఉమ్మడిగా ఈ పిటీషన్ ను దాఖలు చేశాయి. పలు ఉద్యోగ సంఘాల యూనియన్లు, విద్యావేత్తలు కోర్టును ఆశ్రయించాయి.

ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. H1B వీసా ఫీజు పెంపు వల్ల నైపుణ్యం కొరత ఏర్పడుతోందని అంగీకరించారు. కీలక ఉద్యోగాలను భర్తీ చేయడానికి అమెరికాలో తగినంత నైపుణ్యం లేదని తేల్చి చెప్పారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. ఫీజు పెంపు వల్ల అమెరికాకు తగినంత ప్రొఫెషనల్స్ రావట్లేదని, అదే సమయంలో ఇక్కడి ఉద్యోగుల వేతనాలను కంపెనీలు తగ్గిస్తున్నాయన్న ఆందోళనలు ఉన్నాయని చెప్పారు.
అయినప్పటికీ- విసా ఫీజును తగ్గించాలనే ప్రతిపాదనలేవీ లేవని ట్రంప్ తెలిపారు. అమెరికాలో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారని ఫాక్స్ న్యూస్ హోస్ట్ లారా ఇంగ్రహమ్ చెప్పగా.. దీన్ని ఆయన తోసిపుచ్చారు. కొన్ని రంగాలకు సంబంధించిన ప్రొఫెషనల్స్ దేశంలో లేరని తేల్చి చెప్పారు. తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంపై ప్రజలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, డిఫెన్స్ వంటి రంగాల్లో ఈ లోటు ఉందని అన్నారు.
కాగా 'ప్రాజెక్ట్ ఫైర్‌వాల్' పేరుతో సెప్టెంబర్‌లో ప్రారంభమైన వీసా ఫీజు పెంపు వల్ల ఐటీ, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో పని చేసే విదేశీ ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోయింది. ఆయా కంపెనీలు వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని అప్పట్లో వైట్ హౌస్ పేర్కొంది. H-1B దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అమెరికన్ ఉద్యోగాలను రక్షించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ మా వద్ద ఉన్న ప్రతి వనరును ఉపయోగిస్తోందని తెలిపింది.












Click it and Unblock the Notifications